Navarathi 2023 : రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం.. ముస్తాబైన అమ్మవారి ఆలయం
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రేపటి (ఆదివారం) నుంచి దసరా ఉత్సవాలు
- By Prasad Published Date - 12:33 PM, Sat - 14 October 23

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో రేపటి (ఆదివారం) నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 9 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలకు అమ్మవారి ఆలయం ముస్తాబైంది. ఈ వేడుకలు అశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమవుతాయి.ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయ దశమి) నాడు అక్టోబర్ 23 వరకు కొనసాగుతాయి. అదే రోజు తెప్పోస్తవంతో ఉత్సవాలు ముగుస్తాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ది గాంచిన ఆలయం ఇంద్రకీలాద్రి. ప్రతి సంవత్సరం పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు, లాకర్లు తదితర పనులు పూర్తయ్యాయి. అక్టోబరు 20న సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.ప్రతి రోజు లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఇవ్వగా, మిగిలిన రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజున తెల్లవారుజామున 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది.