Ration Distribution : ఏపీలో రేషన్ పంపిణీ షురూ.. సంచార వాహనాలతో సరఫరా
Ration Distribution : ఎన్నికల సంఘం ఆదేశం మేరకు వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ ఈరోజు నుంచి మొదలైంది.
- Author : Pasha
Date : 01-05-2024 - 8:33 IST
Published By : Hashtagu Telugu Desk
Ration Distribution : ఎన్నికల సంఘం ఆదేశం మేరకు వాలంటీర్ల ప్రమేయం లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ ఈరోజు నుంచి మొదలైంది. మునుపటిలాగే మొబైల్ డిస్పర్సింగ్ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్లు రేషన్‌బియ్యం, పంచదార, గోధుమపిండిని నిర్దేశిత ధరలతో కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ఈ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. విటమిన్ బీ12, ఐరన్ కలిపిన పోషకవిలువలతో కూడిన బియ్యాన్ని పంపిణీ(Ration Distribution) చేస్తున్నారు. గోధుమపిండిని కేజీకి రూ.16కే ఇస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
రేషన్ బియ్యాన్ని అనధికారికంగా కొనడం కానీ, అమ్మడం కానీ చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారని అధికారులు హెచ్చ రించారు. నిత్యావసరాల పంపిణీలో ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేయాలని కోరారు. వాలంటీర్ల స్థానంలో వీఆర్‌వోలు రేషన్ పంపిణీలో పాల్గొంటున్నారు. రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైనా బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే వీఆర్వోలు వాటిని సరి చేయాలని అధికారులు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్లు సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై స్పందించిన ఎన్నికల సంఘం, వాలంటీర్లను పింఛన్ల పంపిణీలో, రేషన్ పంపిణీలో పాల్గొనొద్దని ఆదేశించింది.
Also Read :AP Elections : జగన్‌పై 26 మంది.. చంద్రబాబుపై 12 మంది.. షర్మిలపై 13 మంది పోటీ
ఏపీలో ఇప్పటికే వేలాది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇలా రాజీనామా చేసిన వారిని ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ వాడుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి.వాలంటీర్లను ఇంటింటికీ పంపి పింఛనుదారులు, లబ్ధిదారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు వైఎస్సార్ సీపీ ప్రారంభించిందని అంటున్నారు. మళ్లీ వైసీపీ కే ఓటు వేయాలనీ, అప్పుడే జగన్ ముఖ్యమంత్రి అవుతారని, పింఛన్లతోపాటు అన్ని ప్రభుత్వ పథకాలను తామే ఇంటికే తీసుకొచ్చి అందిస్తామని.. రాజీనామా చేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చెబుతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన వాలంటీర్లను ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా వాడుకోవాలని వైఎస్సార్ సీపీ యత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే జరిగితే, ఇక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు సజావుగా జరగడానికి ఆస్కారమే ఉండదనీ.. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.