Navaratri 2023 : ఇంద్రకీలాద్రిపై తొలిరోజు దుర్గమ్మని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
ఇంద్రకీలాద్రిపై దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలిరోజు అమ్మవారిని
- By Prasad Published Date - 08:55 PM, Sun - 15 October 23

ఇంద్రకీలాద్రిపై దసరాశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలిరోజు అమ్మవారిని దర్శించుకునేందకు భక్తులు బారులు తీరారు. తొలిరోజు బాలత్రిపురసుందరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత సంతృప్తికరంగా దర్శనం చేసుకునేలా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. తొలిరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. క్యూ లైన్ల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు అమ్మవారి దర్శన భాగ్యం చాలా బాగా జరిగిందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. 500 రూపాయల క్యూ లైన్ కు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందాయని వెంటనే సమస్యను చక్కదిద్దినట్లు తెలిపారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు వంటివి క్యూలైన్లలో భక్తులకు అందజేస్తున్నట్లు తెలిపారు. అధికారులు అందరూ బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు.
Also Read: Navaratri 2023 : హైదరాబాద్‌లో మొదటిసారి భారీగా శ్రీ శక్తి మహోత్సవములు.. ఘనంగా శరన్నవరాత్రులు..