AP Statute Politics: నరసరావుపేటలో వేడెక్కిన విగ్రహ రాజకీయాలు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి.
- By Hashtag U Published Date - 03:59 PM, Wed - 31 August 22

పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ విగ్రహ రాజకీయాలు వేడెక్కాయి. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయని పరిస్థితి ఏర్పడింది. నరసరావుపేట పల్నాడు బస్టాండ్, మయూరి సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఇటీవల భూమి పూజ చేశారు. అయితే, ప్రజలు తిరిగే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని నరసరావుపేటకు చెందిన గూడూరి శేఖర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలు ఉపయోగించే స్థలాల్లో అనుమతి లేకుండా విగ్రహాలు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని, అనధికారికంగా విగ్రహాలు పెట్టేందుకు వీలులేదని పల్నాడు జిల్లా కలెక్టర్‌కు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఎక్కడైనా విగ్రహం పెట్టే ముందు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అయితే, కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా పల్నాడు సెంటర్‌లో వైసీపీ నేతలు వైఎస్ విగ్రహ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార పార్టీ నేతలే హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. మరోవైపు టీడీపీ నేతలు కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.