Banakacharla Project : చంద్రబాబు కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
Banakacharla Project : రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
- Author : Sudheer
Date : 15-07-2025 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) విషయంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) భారీ షాక్ ఇచ్చింది. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీకి అందజేయాలని సీఎం చంద్రబాబు భావించిన..ఇందుకు తెలంగాణ సర్కార్ అడ్డుపడుతూ వచ్చింది. ఇప్పటికే కేంద్రానికి లేఖ సైతం రాసింది. ఈ క్రమంలో కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ ప్రాజెక్ట్ విషయమై మాట్లాడేందుకు ఆహ్వానం పలికింది. కాగా రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖలో బనకచర్ల ప్రాజెక్టు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అనుమతులు పొందలేదని, కృష్ణా నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ తేల్చిచెప్పింది.
అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు అధికారికంగా ఒక ఎజెండా పంపించింది. అందులో కృష్ణా నదిపై ఇప్పటికే ప్రారంభమైనా ఇంకా అనుమతులు పొందని ప్రాజెక్టులపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, ఫార్మల్ క్లియరెన్సులు, పర్యావరణ అనుమతుల వంటి అంశాలే ప్రాధాన్యంగా తీసుకోవాలని అభిప్రాయపడింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టును ప్రాధాన్య అంశంగా మంజూరు చేయాలంటూ కేంద్రానికి సింగిల్ ఎజెండా పంపడం గమనార్హం.
బనకచర్ల ప్రాజెక్టు ప్రకారం, రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కృష్ణా నదిపై చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ప్రాథమిక సర్వేలు, డిజైన్లు సిద్ధం చేయాలని అధికారులు ఇప్పటికే పనులు ప్రారంభించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిని వ్యతిరేకిస్తూ, ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఏ అనుమతులు లేవనీ, చర్చకు వస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశముందని హెచ్చరించింది.
Banakacharla : ఏపీకి షాక్ ఇచ్చిన తెలంగాణ.. బనకచర్లపై చర్చకు నో
ఈ నేపథ్యంలో రేపు జరగనున్న సీఎంల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగకపోవచ్చు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో, తదుపరి కార్యాచరణ ఏంటో అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టుల ఆమోదం వంటి అంశాల్లో సమన్వయం లేకపోవడం వల్ల నదీజలాలను పంచుకునే ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారే అవకాశముంది. కేంద్రం మధ్యవర్తిగా చొరవ చూపి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తేనే ఇలాంటి వివాదాలకు పరిష్కారం లభించనుంది.