AP Politics : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! అక్టోబర్ 15న `హోదాస్త్రం` షురూ!
ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ `ప్రత్యేకహోదా` అస్త్రాన్ని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మీద సంధించబోతున్నారు. \
- By CS Rao Published Date - 01:08 PM, Fri - 16 September 22

ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ `ప్రత్యేకహోదా` అస్త్రాన్ని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మీద సంధించబోతున్నారు. బీజేయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో దేశాన్ని చుట్టేస్తోన్న ఆయన ఏపీ వైపు ఇప్పటి వరకు చూడలేదు. కానీ, వచ్చే నెల 15వ తేదీన `లెగ్` పెట్టబోతున్నారని తెలంగాణ భవన్ వర్గాల టాక్. అందుకోసం `ప్రత్యేక హోదా` అస్త్రాన్ని బీహార్ సీఎం నితీష్ కుమార్ భుజం మీద నుంచి ఎక్కుపెట్టారు.
విభజన చట్టంలో లేకపోయినప్పటికీ పార్లమెంట్ వేదికగా ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ఇచ్చిన హామీ ప్రత్యేకహోదా. ఆ తరువాత యూపీఏ చేతి నుంచి ఢిల్లీ అధికారం పోయింది. ప్రత్యేకహోదా కూడా ముగిసిన అధ్యాయంగా మిలిగింది. ప్రస్తుతం ఉన్న మోడీ సర్కార్ ప్రత్యేకహోదా దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని తేల్చేసింది. ఆ క్రమంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ కేంద్రంపై ఫైట్ చేయలేక నిమ్మకుండిపోయాయి. ఇలాంటి తరుణంలో `హోదా` అస్త్రాన్ని కేసీఆర్ అండ్ టీమ్ అందుకుంది.
బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే వెనుకబడిన రాష్ట్రాలన్నింటికీ ప్రత్యేకహోదా ఇస్తామని నితీష్ తాజాగా ప్రకటించారు. అంటే, నితీష్ తో జతకట్టిన కేసీఆర్ కూడా పరోక్షంగా ఏపీ ప్రత్యేకహోదాకు జైకొట్టినట్టే. పైగా ఎన్డీయే ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా నిలదీసినప్పుడు కూడా ఏపీ పక్షాన టీఆర్ఎస్ ఎంపీలు నిలిచారు. ప్రత్యేకహోదా ఏపీకి ఇవ్వాలనే నినాదానికి కేసీఆర్, కేటీఆర్, కవిత పలు సందర్బాల్లో అనుకూలంగా మాట్లాడారు. జాతీయ ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తోన్న కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి బ్రహ్మాస్త్రంగా `హోదా`ను అందుకోబోతున్నారని వినికిడి.
మూడేళ్ల క్రితం విజయవాడలో జరిగిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. 2019 జూన్ లో కేసీఆర్ఏ, ఏపీ సీఎం తో సమావేశం అయ్యారు. ఆ తరువాత హైదరాబాద్ కేంద్రంగా రెండు రాష్ట్రాల సీఎంలు కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల గురించి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఆ తరువాత ఇద్దరూ వ్యూహాత్మకంగా దూరంగా ఉంటున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు తొలుత కేసీఆర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయనకు లభించిన ఆదరణ అపూర్వం. ఆ తరువాత తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లినప్పుడు హోర్డింగ్ లతో ఏపీ ప్రజలు స్వాగతం పలికారు. విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపానందస్వామి వద్దకు వెళ్లినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనకదుర్గమ్మ వద్ద మొక్కులు తీర్చుకోవడానికి కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నప్పుడు వీరాభిమానులు కొందరు అపూర్వ స్వాగతం పలికారు. ఇవన్నీ గమనిస్తే, కేసీఆర్ కు ఏపీలోనూ ఫాలోయింగ్ ఉందని అర్థం అవుతోంది.
తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా చూపిండం ద్వారా జాతీయస్థాయికి ఎదగాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం టీఆర్ఎస్ బదులుగా కొత్త పార్టీని స్థాపించడం ద్వారా వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజకీయ లాబీయింగ్ చేస్తోన్న కేసీఆర్ పక్కనే ఉన్న ఏపీకి ఇప్పటి దూరంగా ఉన్నారు. ఇక ఏపీలోనూ ఎంట్రీ ఇవ్వడానికి మాస్టర్ స్కెచ్ వేశారు. అందుకు కాలం కూడా ఆయనకు కలిసొచ్చింది.
ఏపీలో సీపీఐ జాతీయ మహా సభలు వచ్చే నెల( `అక్టోబర్ 14వ తేదీన భారీ ర్యాలీ, 15న బహిరంగ సభ`) 14, 15 తేదీల్లో జరగబోతున్నాయి. ముగింపు సభకు దేశ వ్యాప్తంగా బీజేయేతర పార్టీల అధిపతులు, సీఎంలను సీపీఐ ఆహ్వానిస్తోంది. ఆ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ , బీహార్ సీఎం నితీష్, కేరళ, తమిళనాడు సీఎంలను కూడా ఆహ్వానించింది. విజయవాడ కేంద్రంగా వచ్చే నెల 15వ తేదీన సరికొత్త రాజకీయ ఆవిష్కరణ జరగబోతుంది. ఏపీలోని ఇప్పుడున్న పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాటానికి దిగడమా? లేక కేసీఆర్ తో కలిసి కదలడమా? అనేది తేలనుంది.
Related News

Women Reservation Bill: మహిళ బిల్లును సమర్ధించిన నితీష్
దేశవ్యాప్తంగా మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న బిల్లుకు ఈ రోజు మోక్షం లభించింది.