Ali Rajyasabha Seat: సినీ నటుడు ‘అలీ’కి రాజ్యసభ సీటు..?
ఏపీలో సినిమా టికెట్ ధరల అంశంపై సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసిన అనంతరం అలీ కి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
- Author : Hashtag U
Date : 10-02-2022 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో సినిమా టికెట్ ధరల అంశంపై సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసిన అనంతరం అలీ కి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి పాల్గొన్నారు. సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు… త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని ఆశిస్తున్నట్లు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు.

సినీ పెద్దలు తిరుగు ప్రయాణం అయిన తర్వాత సీఎం జగన్ తో అలీ ప్రత్యేకంగా సమావేశం అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎప్పటి నుంచో తాను ఆశిస్తున్న రాజ్యసభ పదవి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా జగన్ ను అలీ కోరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ లో ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవనున్న సంగతి తెలిసిందే. అందులో విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభుతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. విజయసాయిరెడ్డి కి ఎలాను రెన్యువల్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే మైనారిటీ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని అలీ కి కూడా రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉందని ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. మైనారిటీ కోటాలో ఇచ్చేందుకు జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు అలీ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అలానే ఇదే విషయమై ఇవాళ అలీకి సీఎం జగన్ కూడా క్లారిటీ ఇచ్చినట్లు ఓ వార్త అయితే చక్కర్లు కొడుతోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే… మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.