Bill Gates : బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ..పలు కీలక ఒప్పందాలు
ఈ నేపథ్యంలోనే బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 02:40 PM, Wed - 19 March 25

Bill Gates : మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. పార్లమెంట్‌లో ఈరోజు(బుధవారం) కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం బిల్‌గేట్స్‌తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించనుంది.
Read Also: Telangana Budget 2025: తెలంగాణ అప్పులు, ఆదాయం.. చైనా ప్లస్ వన్ వ్యూహం
వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశమై పలు ఒప్పందాలపై చర్చించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు. 1995 నుంచి బిల్‌గేట్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సమావేశం గురించి సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని… ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. ఏపీ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధానితోనూ భేటీ కానున్నారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహాయ నిధులతో పాటు పలు ముఖ్య అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారని సమాచారం. అమరావతి పునర్నిర్మాణ వేడుకకు రావాలని మోడీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.
Read Also: Grok 3 Budget Analysis : తెలంగాణ 2025-26 బడ్జెట్ పై AI చాట్‌బాట్ రేటింగ్