CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్.. పూర్తి షెడ్యూల్ ఇలా..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు జరగనున్నాయి.
- By Kavya Krishna Published Date - 12:27 PM, Mon - 14 July 25

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం (జూలై 16) ఉదయం అమరావతి నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకునే సీఎం, రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో కేంద్రంతో వ్యూహాత్మకంగా చర్చలు జరపనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రాజెక్టులకు అవసరమైన నిధుల విడుదల, కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు అనుమతుల కల్పన, కేంద్ర సహకారం పొందాల్సిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులపై ప్రాధాన్యతతో చర్చలు జరగనున్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)కు సంబంధించిన పనులపై కూడా సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Karnataka : కృష్ణుడు చెప్పాడని ఇద్దరు చిన్నారులతో గుహలో ఉంటున్న రష్యన్ మహిళ
మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతో సమావేశం జరుగనుంది. ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, మెట్రో ప్రాజెక్టుల పైప్లాన్‌లపై చర్చించే అవకాశం ఉంది.
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా ఆయన పీవీ విశిష్ట సేవలను స్మరించుకుంటూ ప్రసంగించనున్నారు.
బుధవారం (జూలై 17) కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రత్యేక భేటీలు జరగనున్నాయి. ఈ భేటీల్లో రాష్ట్రానికి అనుగుణంగా కేంద్ర ఆర్థిక సహకారం అందించాలన్న దిశగా చర్చలు జరిగే అవకాశముంది.
అదేరోజు సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య (CII) ఆధ్వర్యంలో నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ ఫోరంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వ ఉద్దేశాలను వివరిస్తారని సమాచారం.
ఈ రెండు రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు జూలై 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు అమరావతి తిరిగి చేరుకోనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల పరంగా ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమైన అభివృద్ధి ముందడుగులు పడే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Karnataka : కృష్ణుడు చెప్పాడని ఇద్దరు చిన్నారులతో గుహలో ఉంటున్న రష్యన్ మహిళ