Heavy Rains : వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు
- By Sudheer Published Date - 05:47 PM, Sun - 1 September 24

అల్ప పీడనం కారణంగా ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి వర్షాలు కురుస్తున్నాయి. ఆ జిల్లా , ఈ జిల్లా అనే తేడాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా (AP) భారీగా వర్షాలు పడుతుండడం తో వాగులు , వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు నేషనల్ హైవేలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. వందలాది ఇల్లు నీటిలో చిక్కుకున్నాయి. విజయవాడ నగరం దాదాపు నీటిలో మునిగింది. ఈ క్రమంలో బాధితులు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో వరద బాధితులకు సీఎం చంద్రబాబు (CM CHandrbabu) సాయం ప్రకటించారు. 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందువల్లే ముంపు ప్రాంతాలు పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ తక్షణ కర్తవ్య మని తెలిపారు. రెండు హెలికాప్టర్లు, భారీగా బోట్లు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇక అమరావతి మునిగిపోయిందంటూ కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లెవరూ అలా మాట్లాడరు. వైసీపీ కావాలని తప్పుడు ప్రచారం చేస్తోంది. అమరావతి మునిగిపోవాలని, స్మశానం కావాలనేది వారి కోరిక. రాజధానిని చూసి ఓర్వలేకపోతున్నారు. గతంలో వివేకాను చంపింది నేనే అని ప్రచారం చేశారు. అప్పుడే నేను కఠినంగా వ్యవహరించి ఉంటే బాగుండేది’ అని వ్యాఖ్యానించారు.
ఇక విజయవాడ కనకదుర్గ వారధిపై ఆగి నది ప్రవాహ తీవ్రత వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేపటికల్లా ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. దిగువ ప్రాంతాల్లో సహాయక చర్యలు తీసుకుంటున్నామని, బండ్స్ పటిష్ఠపరుస్తున్నామని చెప్పారు. 17వేల మందిని క్యాంపుల్లోకి తరలించామని వివరించారు.
Read Also : Hussain Sagar : హుస్సేన్ సాగర్‌కు భారీగా ఇన్ ఫ్లో… నాలుగు స్లూయిస్ గేట్లు తెరిచి నీటి విడుదల