CM Chandrababu: గ్లోబల్ మెడ్‌సిటీగా అమరావతి
రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుండి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- By Kode Mohan Sai Published Date - 02:41 PM, Mon - 7 April 25

రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుండి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైద్యం, ఆరోగ్యం గురించి మీడియా ముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు మరియు వివిధ వ్యాధులపై ఆయన వివరణ ఇచ్చారు.
‘‘కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. కొన్ని ప్రాంతాల్లో గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పురుషులతో పోలిస్తే మహిళల్లో హైపర్‌టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని’’ తెలిపారు.
ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే ఆరోగ్యం:
‘‘చాలా వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే. ఒక సాధారణ కుటుంబం, అంటే నలుగురు సభ్యులతో ఉంటే, రోజుకు 4 గ్రాముల ఉప్పు, నెలకు 600 గ్రాములే తినాలి. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు, నెలకు 2 లీటర్ల మించనివ్వకూడదు. చక్కెర రోజు 25 గ్రాముల చొప్పున, నెలకు 3 కిలోలు మాత్రమే ఉపయోగించాలి. ఇది సమతుల్యమైన డైట్‌గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
రోజుకు కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని, అలాగే ప్రాణాయామం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాణాయామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఇటీవలే ‘‘న్యూట్రిఫుల్’’ అనే యాప్‌ను తయారుచేశాం, ఇది స్కోచ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ యాప్‌ను ఇప్పటివరకు 4 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాప్ ఇది’’ అని చంద్రబాబు చెప్పారు.