Andhra Pradesh: చంద్రబాబు దూకుడు.. టెన్షన్‌లో టీడీపీ తమ్ముళ్ళు..!
- By HashtagU Desk Published Date - 11:40 AM, Sat - 26 February 22

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించే ఉద్యేశ్యంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఈ నేపధ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల పనితీరు పై సర్వేలు చేయిస్తున్నారని టాక్. అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై లోతుగా విశ్లేషిస్తున్నారని, ఇప్పటికే పలు నియోజకవర్గాల నుండి సర్వే నివేదికలు చంద్రబాబుకు అందాయని తెలుస్తోంది.
ఇక ఈ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించి, ముందుగానే టీడీపీ అభ్యర్ధులను ప్రజా క్షేత్రంలోకి పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. అయితే ఒకసారి చంద్రబాబు గత ఎన్నికల స్ట్రాటజీని గమనిస్తే, ఆయన ఎప్పుడూ చివరి నిమిషం వరకు అభ్యర్ధులను ప్రకటించరు.. ఇదే సంప్రదాయాన్ని చంద్రబాబు గత ఎన్నికల నేపధ్యంలో పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక విషయంలో పాత సంప్రదాయలకు చంద్రబాబు స్వస్థి పలుకుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్బంగా చంద్రబాబు ఇదే ఫార్ములాతో, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని ముందుగానే టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినా, అధికార పార్టీ మెజారిటీని చాలా వరకు నివారించగలిగారు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోయినా, ఫలితం మాత్రం ఆ పార్టీకి కొంత అనుకూలంగానే కనిపించిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో వచ్చే సాదారణ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయినట్టు టీడీపీ తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు.
ఈ నేపధ్యంలోనే ఇటీవల చంద్రబాబు వరుసగా రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చి, జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు చంద్రబాబు. ఈ క్రమంలో చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికలో పలు కీలక విషయాలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. సామాజిక కోణంతో పాటు, అభ్యర్ధుల ఆర్థిక పరిస్థితి, నియోజకవర్గంలో ఉన్న పట్టు.. ఇలా పలు కోణాల్లో అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని సమచారం.
ఈ నేపధ్యంలో ఇప్పటికే యాభై నుంచి డబ్బై నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపిక పై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని, వారిని చంద్రబాబు ఏడాది ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పొత్తులతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉండదు. అందుకనే టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్ధును ప్రకటిస్తే, వారు ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించి, అధికార ప్రభుత్వం పైన, స్థానిక ఎమ్మెల్యేల పై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి వెళ్ళి వివరించే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల కోసం, ఇప్పటి నుంచే చంద్రబాబు స్పీడ్ పెంచడంతో, టీడీపీ తమ్ముళ్ళలో టెన్షన్ స్టార్ట్ అయ్యిందని, టీడీపీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.