Chandrababu: జగన్‌కు ఇదే చివరి చాన్స్.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
- By HashtagU Desk Published Date - 09:42 AM, Tue - 22 February 22

టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశంపార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు వైకాపా పాలనలో రాష్ట్రం బాగా నష్టపోయిందని, వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దీంతో జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ చివరి అవకాశంగా చేసుకున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ నేపధ్యంలో టీడీపీ నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, 25 పార్లమెంట్ స్థానాల ఇంచార్జ్‌లతో సమావేశంలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడాలని, పనిచేయని నేతలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రతి కార్యకర్తకు, టీడీపీ నాయకులు అండగా నిలవాలన్నారు.
పార్టీలో ఉండాలనుకునే వాళ్ళే ఉండొచ్చని, పార్టీ విధానాలు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చాని, పార్టీలో కొనసాగుతూ, పనిచేయని నాయకులను ఇకముందు పార్టీ భరించబోదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని, పనిచేయని వారి పై కఠినచర్యలు తీసుకునేందుకు వెననుకాడే చాన్స్ లేదన్నారు చంద్రబాబు. ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామ, మండల స్థాయిలో పెండింగులో ఉన్న కమిటీల నియమాకాన్ని వెంటనే పూర్తి చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
ఇక తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని జగన్ పై విమర్శలు చేశారు చంద్రబాబు. సీఎం జగన్ అసమర్థ పాలన, స్వార్థపూరిత విధానాలతో, రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, జగన్ దగ్గర అధికారం, డబ్బు ఉంటే.. తెలుగుదేశంపార్టీకి ప్రజాబలం ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్‌కు ఒక అవకాశం ఇచ్చారని, అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వ్యవస్థల్ని సర్వ నాశనం చేశారని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందలకు గురవుతున్నారని, దీంతో ఏపీ ప్రజలు జగన్ సర్కార్‌కు మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని చంద్రబాబు జోస్యం చెప్పారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.