Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు
- Author : Vamsi Chowdary Korata
Date : 27-06-2026 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెనుమాక పర్యటనకు బయల్దేరి వెళ్లిన వైసీపీ CRDA పరిరక్షణ కమిటీని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను తాడేపల్లిలోని ఉండవల్లి వద్ద అమరావతి రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు, అమరావతి రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ వాగ్వాదం, తోపులాట మరింత శ్రుతిమించి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసే వరకూ వెళ్లింది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ గాయపడినట్లు తెలిసింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటనతో అమరావతిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మరోవైపు వైసీపీ నేతలను అడ్డుకున్న అమరావతి రైతులు.. ‘గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కృష్ణాయపాలెం, పెనుమాకలలో అమరావతి JAC నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన తర్వాతే వైసీపీ నేతలు ఈ ప్రాంతంలో పర్యటించాలని అమరావతి రైతులు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలోని రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మూడు రాజధానులంటూ ఐదేళ్లు కాలయాపన చేశారని.. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని అన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని స్పష్టం చేశారు.
మరోవైపు అమరావతిలో జరుగుతున్న అకృత్యాలు బయటకు రాకూడదనే సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పథకం ప్రకారం తమపై దాడులు చేయించారని.. తమను హత్య చేసేందుకు ప్రయత్నించారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తమపై దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాజధాని భూ సమీకరణలో భాగంగా భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లు వదిలారని వైసీపీ ఆరోపిస్తోంది. భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపులకు దిగుతున్నారంటూ.. ఆ పొలాల రైతులను పరామర్శించేందుకు రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు అమరావతిలో పర్యటించాలని భావించారు. అయితే అమరావతి రైతులు, మహిళలు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి.