AP : బైబై జగన్ ..జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ?: టిడిపి ఎమ్మెల్యేలు
- By Sudheer Published Date - 01:06 PM, Mon - 5 February 24

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు టిడిపి(TDP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… వైఎస్‌ఆర్‌సిపి (YSRCP)పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పారు. టిడిపి ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని… అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. తాము అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. సీఎం జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని జోస్యం చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సార్.. మీతో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందంటూ నిరసన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు కాకుండా వైఎస్‌ఆర్‌సిపి నేతలకు ఇచ్చారని విమర్శించారు. అంగన్వాడీలకు జీతాలు పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు.
విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ చేశామని గవర్నర్ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో తీవ్ర నిరసన నెలకొంది. టిడిపి సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు.
Read Also : Raa Kadali ra : చంద్రబాబు సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు