BPCL: రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ భారీ పెట్టుబడి?
రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి దిశగా కీలక నిర్ణయం తీసుకోబడింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం దశల వారీగా రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ నిర్ణయించింది.
- By Kode Mohan Sai Published Date - 12:30 PM, Wed - 25 December 24

BPCL: రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడి: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. మొత్తం రూ.95 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును దశల వారీగా అమలు చేయనున్నారు. ఇప్పటికే ముంబయి, కొచ్చి, బినాలో మూడు రిఫైనరీలు ఏర్పాటు చేసిన బీపీసీఎల్, నాలుగో రిఫైనరీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టేందుకు రూ.6,100 కోట్ల అంచనా వ్యయంతో సంస్థ పాలకమండలి ఈమధ్య ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)కు మంగళవారం రాసిన లేఖలో సంస్థ పేర్కొంది.
“సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) రెగ్యులేషన్స్-2015లోని 30వ నిబంధన ప్రకారం, తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలను ప్రారంభించడానికి మేము ఆమోదం ఇచ్చాం. దీనిలో పలు అంశాలపై ప్రాథమిక అధ్యయనాలు, భూసేకరణ, డీపీఆర్ తయారీ, పర్యావరణ ప్రభావ మదింపు, ప్రాథమిక డిజైన్ ఇంజినీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ తదితరాలు ఉంటాయి” అని లేఖలో పేర్కొంది.
గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూసేందుకు వణికిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే, ఆంధ్రప్రదేశ్‌లో అనేక దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో అడుగుపెట్టాయి. ఇందులో ఉక్కు రంగంలో ఆర్సెలార్ మిత్తల్ రూ.1,61,198 కోట్లు, ఇంధన రంగంలో రిలయన్స్ రూ.65 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అలాగే, విశాఖలో టీసీఎస్ కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ అంగీకరించింది.

Bpcl Stocks
గుజరాత్‌తో పోటీ తట్టుకుని, బీపీసీఎల్ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చింది. గుజరాత్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సులభంగా ఈ పెట్టుబడులను గెలుచుకున్నది. ఈ విజయానికి కారణం, నిరంతర పర్యవేక్షణ, బీపీసీఎల్ సంస్థ యాజమాన్యంతో తీసుకున్న అనేక సంప్రదింపులు. ప్రాజెక్టు కోసం బీపీసీఎల్ ప్రతినిధి బృందం అనేక సార్లు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పరిశీలించింది. అనంతరం, రాష్ట్ర ప్రభుత్వంతో క్రమంగా సంప్రదింపులు జరిపి, తుది నిర్ణయం తీసుకున్నారు.
పోర్టు సమీపంలో ఉండడం, రిఫైనరీ ఏర్పాటుకు కావాల్సిన భూములు అందుబాటులో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని, బీపీసీఎల్ రామాయపట్నాన్ని ప్రాజెక్టు స్థలంగా ఎంపిక చేసింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం ప్రత్యేక బెర్త్ కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది.
భూముల అవసరం
బీపీసీఎల్ ప్రాజెక్టు కోసం సుమారు 5 వేల ఎకరాలు భూమి అవసరం అని సంస్థ తెలిపింది. ఆ మేరకు భూసేకరణకు సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన రూ.6,100 కోట్లలో భూసేకరణ ఖర్చును తొలగించి, మిగతా రూ.4,600 కోట్లను ఇతర అవసరాలకు ఉపయోగించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తరువాత సుమారు లక్ష మంది ఉపాధి పొందే అవకాశమున్నట్లు అంచనా. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 5 వేల మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
బీపీసీఎల్ ఒప్పందం త్వరలో
బీపీసీఎల్‌తో ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ప్రస్తుతం ముంబయి, కొచ్చి, బినాల్లో ఉన్న మూడు రిఫైనరీల ద్వారా ఏటా 96 రకాల చమురు ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ టన్నుల మేర శుద్ధి చేస్తోంది.
చంద్రబాబునాయుడి దార్శనిక నాయకత్వం
బీపీసీఎల్ లేఖను తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, “ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనిక నాయకత్వానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన మార్గదర్శకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో క్రమంగా ముందడుగు వేస్తోంది. రిఫైనరీ ఏర్పాటు కోసం రాష్ట్రం ఎంపికకావడంపై బీపీసీఎల్ యాజమాన్యానికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.
అనుభజ్ఞుడైన నాయకుడి నాయకత్వంలో రాష్త్రం పురోగమిస్తోంది, రాష్ట్ర అభివృద్దిలో బీపీసీల్ పెట్టుబడులు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నా… #bpcl #petroleum #investment #andhrapradesh pic.twitter.com/Glq6GBwbEr
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) December 24, 2024