Mahanadu : మహానాడు వేదిక సాక్షిగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపిన బాబు
Mahanadu : ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ (Free Bus) సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు
- Author : Sudheer
Date : 27-05-2025 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
కడపలో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) కీలక ప్రకటన చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ (Free Bus) సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇది 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో ఒకటిగా ఉంది. ఈ హామీని కార్యరూపం దాల్చించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసే క్రమంలో ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో సన్నాహాలు పూర్తయ్యాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే విధంగా అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాలను పరిశీలించేందుకు మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ బెంగళూరులో పర్యటించి అక్కడి విధానాలను అధ్యయనం చేసింది. అవసరమైన బస్సుల సంఖ్య, సిబ్బంది అవసరం తదితర అంశాలపై కసరత్తు పూర్తయ్యాక, ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Suryakumar Yadav : సూపర్ సూర్యకుమార్.. రెండుసార్లు 600 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డ్
ఇతర సూపర్ సిక్స్ హామీల అమలులో కూడా ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలులో ఉన్నాయి. అలాగే జూన్ 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా ప్రకటించిన హామీలను అమలు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు వారి రోజువారీ జీవితంలో భారాన్ని తగ్గిస్తూ, సంక్షేమాన్ని కళ్లకు కనిపించేలా చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.