Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క దళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు
Aqua Farmers : రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల ఆక్వా సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం చేరాలంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు
- By Sudheer Published Date - 11:29 AM, Sat - 27 September 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న ఆక్వా పరిశ్రమ (Aqua ) వరుస దెబ్బలతో దెబ్బతింటోంది. అమెరికా విధించిన అధిక సుంకాలు(Trump Tariffs ), ఎగుమతిదారుల దళారీ వ్యవస్థ, నాసిరకం సీడ్స్, అధిక విద్యుత్ చార్జీలు, పెరుగుతున్న రోగాల బెడద ఇలా అన్ని కలిసి ఈ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. దేశంలోనే 70 శాతం ఆక్వా ఉత్పత్తులను ఏపీ రైతులే ఉత్పత్తి చేస్తుంటే, ఈ సమస్యలతో సగం ఎకరాలు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు డాలర్ల పంటగా పేరుపొందిన ఈ రంగం క్రమంగా అస్తవ్యస్తమై, రైతులు చేతులు ఎత్తేస్తున్న దశకు చేరింది.
Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?
మునుపటి వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు సబ్సిడీ కరెంట్ సడలింపులు ఇస్తూ, చివరి ఏడాది మాత్రం అనుమతులు లేవని చూపించి 12 వేల కరెంట్ కనెక్షన్లు తొలగించడం రైతులకు పెద్ద దెబ్బతీసింది. కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ ఇప్పటివరకు వాటిని పునరుద్ధరించకపోవడంతో డీజిల్ కొనుగోళ్ల బరువు రైతులపై పడుతోంది. అదే విధంగా ఎగుమతిదారుల సిండికేట్ వలన టన్నుకు 25–30 వేల రూపాయల మేర రైతులు నష్టపోతున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, హ్యాచరీలు నాసిరకం సీడ్స్ విక్రయిస్తుండడం, ఫీడ్ మరియు మెడిసిన్ ధరలపై నియంత్రణ లేకపోవడం వలన కూడా ఆక్వా రంగం మరింతగా కుదేలవుతోంది.
రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల ఆక్వా సాగును 10 లక్షల ఎకరాలకు విస్తరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం చేరాలంటే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా సబ్సిడీ కరెంట్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరించడం, ఫీడ్ మరియు మెడిసిన్ ధరలపై కట్టుదిట్టమైన నియంత్రణ తీసుకోవడం, ఎగుమతుల వ్యవహారంలో సిండికేట్ వ్యవస్థను కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు కేవలం వారి కుటుంబాలకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకూ ముప్పు తెస్తున్నందున, ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుంటే మాత్రమే ఆక్వా పరిశ్రమ మళ్లీ బలపడుతుందన్న నమ్మకంతో వారు ఎదురుచూస్తున్నారు.