AP Rains: ఏపీకి తుపాను ముప్పు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక!
తుపాను ముప్పు నేపథ్యంలో శుక్రవారం డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
- By Gopichand Published Date - 10:35 AM, Sat - 25 October 25
AP Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు (AP Rains) పొంచి ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఈ వాతావరణ వ్యవస్థ క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తుపానుగా రూపాంతరం చెందే క్రమం
- శనివారం (నేడు): అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
- ఆదివారం: ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది.
- సోమవారం: నైరుతి- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా బలపడవచ్చు.
- ఈ తుపానుకు ‘మొంథా (Montha)’ అని IMD నామకరణం చేయనుంది. ఈ పేరును థాయ్‌లాండ్ సూచించింది.
రాష్ట్రంలో రాబోయే 5 రోజులు వర్షాలు
ఈ తుపాను ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం అంటే ఈరోజు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చు.
Also Read: Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
ఆదివారం నాడు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తాజా వర్షపాతం వివరాలు
తుపాను ముప్పు నేపథ్యంలో శుక్రవారం డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని పాకాలలో 152.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.