AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసు.. సిట్ కస్టడీకి నలుగురు కీలక నిందితులు
సిట్ కస్టడీకి లోనైన వారిలో ఐటీ శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, జగన్ కార్యాలయానికి ఓఎస్‌డీగా పనిచేసిన పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు.
- By Latha Suma Published Date - 10:13 AM, Fri - 30 May 25

AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఈ భారీ అవినీతి కేసులో కీలక నిందితులుగా గుర్తించబడిన నలుగురు ప్రముఖులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారికంగా కస్టడీకి తీసుకుంది. ఈ నలుగురు వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా భావించబడుతున్నారు. సిట్ కస్టడీకి లోనైన వారిలో ఐటీ శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, జగన్ కార్యాలయానికి ఓఎస్‌డీగా పనిచేసిన పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు. వీరిని విజయవాడలోని జిల్లా జైలు నుంచి అధికారుల నడుమ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, విచారణ కోసం సిట్ కార్యాలయానికి తరలించారు.
Read Also: Indiramma Amrutham Scheme : తెలంగాణ లో మరో పథకం అమలు
విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం వీరిని రెండు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం మరియు శనివారం రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు వీరిని విచారించనున్నారు. ఈ కేసులో విచారణ జరిపిస్తున్న సిట్ బృందం, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన భారీ మొత్తం చివరికి ఎక్కడికి చేరిందన్న దానిపై దృష్టి సారించింది. ‘అంతిమ లబ్ధిదారుడు’ ఎవరో తెలుసుకోవడమే ఈ విచారణ లక్ష్యంగా ఉంది. సిట్ ఇప్పటికే ఈ నలుగురు వ్యక్తులు డబ్బు ప్రవాహాన్ని బిగ్‌బాస్ అనే గుర్తింపుతో ఉన్న అధికారి మరియు ఆయన సతీమణికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించినట్లు పాక్షిక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.
అవినీతి పథకానికి రూపకల్పన, అమలు, ముడుపుల వసూళ్లు అన్నింటిలోనూ వీరి పాత్ర ఉన్నట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు వెలుగు చూసిన ఆధారాలను బలంగా ఉపయోగించి, మరింత లోతుగా ఈ నలుగురిని ప్రశ్నించనున్నారు. విచారణ సందర్భంగా నిందితుల నుంచి కొన్ని కీలక పేర్లు వెలుగు చూడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ కేసు రాజకీయంగా సైతం ఉత్కంఠత కలిగిస్తోంది. జగన్‌కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులపై విచారణ కొనసాగుతుండటంతో, రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ జివ్వెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలకు ఈ కేసు మళ్లీ దారితీయనుంది.