Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు
Alcohol Sales : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పారదర్శకతను పెంచి, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది
- By Sudheer Published Date - 01:09 PM, Sat - 8 November 25
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పారదర్శకతను పెంచి, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటివరకు మద్యం తయారీ సంస్థల (డిస్టిలరీ) నుంచి డిపోలకు చేరుకునే వరకు మాత్రమే ట్రాకింగ్ వ్యవస్థ ఉండేది. అయితే, ఇకపై ఆ వ్యవస్థను వినియోగదారుడి వరకు విస్తరించే యోచనలో ఉన్నారు. అంటే, ప్రతి బాటిల్ ఎక్కడ తయారై, ఎక్కడి షాపులో అమ్ముడైందో ప్రభుత్వం పక్కాగా తెలుసుకునే విధంగా వ్యవస్థను అమలు చేయనుంది.
Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!
ఇక మద్యం విక్రయాల్లో నకిలీ సీసాలు, అక్రమ సరఫరాలను అరికట్టేందుకు “సురక్ష యాప్”ను మరింత సమర్థంగా ఉపయోగించనున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసే సీసాలను స్కాన్ చేసి అవి నిజమైనవా కాదా తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాప్ ద్వారా స్కాన్ చేసే వ్యక్తుల ఫోన్ నంబర్ లేదా ప్రాథమిక వివరాలు నమోదయ్యే విధంగా మార్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే వినియోగదారుల వ్యక్తిగత సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఆప్షనల్ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.
మద్యం విక్రయాల్లో పారదర్శకతను పెంచడం కోసం డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం చాలా షాపులు, బార్లు నగదు చెల్లింపులనే స్వీకరిస్తున్నప్పటికీ, ఇకపై డిజిటల్ పేమెంట్స్ (UPI, కార్డ్, QR కోడ్) సౌకర్యం తప్పనిసరి కానుంది. దీని వల్ల అక్రమ నగదు లావాదేవీలను నియంత్రించడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా సమర్థంగా పర్యవేక్షించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న డిజిటల్ మద్యం విక్రయ విధానాలను అధ్యయనం చేసి, ఏపీలో పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.