AP Govt: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్.. తక్షణమే అమల్లోకి
ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్ల నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
- Author : News Desk
Date : 18-04-2025 - 7:05 IST
Published By : Hashtagu Telugu Desk
AP Govt: ఎస్సీ వర్గీకరణపై ఉపకులాలకు వర్తించే రిజర్వేషన్ల నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు -2025 కు సంబధించి గురువారం ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కింద ఉప కులాలకు వర్తించే రిజర్వేషన్ల నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు, ఇతర సంస్థల్లో వర్గీకరణ ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంటూ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంస్థల్లో అడ్మీషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ ఖాళీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా మూడు కేటగిరీలుగా ఉప కులాల వర్గీకరణ కింద రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేసింది. మొదటి గ్రూప్ లోని రెల్లి సహా 12 ఉప కులాలకు 1 శాతం చొప్పున రిజర్వేషన్, రెండో గ్రూప్ లో మాదిగ సహా 18 ఉప కులాలకు 6.5 శాతం రిజర్వేషన్, మూడో గ్రూప్ లోని మాల సహా 29 ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ.. మొత్తంగా ఎస్సీ వర్గీకరణ కింద 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా నిబంధనలను ప్రభుత్వం జారీ చేసింది.
మొత్తం 200 రోస్టర్ పాయింట్ల అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు ఈ మూడు కేటగిరిల్లోనూ వర్తిస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్ల సమయంలో అర్హులైన అభ్యర్ధులు లేకపోతే తదుపరి నోటిఫికేషన్ కు ఆ ఖాళీలు బదలాయిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.