Sunil : సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- By Latha Suma Published Date - 08:14 PM, Fri - 17 January 25

Sunil : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై విచారణకు అథారిటీని వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై అభియోగాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ కుమార్ పై త్రిబుల్ ఆర్ ఫిర్యాదు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు అథారిటీని వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిలో సునీల్ కుమార్ ఉన్నారన్నది రఘురామ కృష్ణరాజు ప్రధాన ఆరోపణ. ఆ సమయం నుండే కేంద్రానికి కూడ త్రిబుల్ ఆర్ ఫిర్యాదులు చేశారు.
తాజాగా విచారణకు కమిటీ వేయడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పలుమార్లు కేంద్ర హోంశాఖ నుంచి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి లేఖలు వచ్చాయి. ఓ సారి గట్టిగా హెచ్చరికలు రావడంతో ఆయనను సీఐడీ చీఫ్ పదవి నుంచి బదిరి చేసినట్లుగా చెబుతున్నారు. సునీల్ కుమార్ సర్వీసులో ఉంటూనే ఓ మతపరమైన సంస్థను నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన హిందూత్వంపై గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని కొన్ని సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.