AP Fee Reimbursement: విద్యార్థులకు నారా లోకేష్ గుడ్ న్యూస్!
- By Kode Mohan Sai Published Date - 01:10 PM, Wed - 23 October 24

AP Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి ఎక్స్‌లో తెలిపారు. విద్యార్థులకు సంబంధించి ఈ రీయింబర్స్మెంట్ పట్ల త్వరలో మంచి సమాచారాన్ని అందిస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. “వైసీపీ ప్రభుత్వం రూ.3500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా మోసం చేసింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రులు మరియు విద్యాశాఖలోని సహచరులతో కలిసి పని చేస్తానని, త్వరలోనే శుభవార్త అందిస్తానని హామీ ఇస్తున్నాను” అని ఆయన ‘ఎక్స్’లో వెల్లడించారు.
GOOD NEWS SOON! 👍
To all our student friends: The YSRCP Govt has cheated you by not paying fee reimbursement dues to the tune of Rs.3500 crores. I'm collaborating with my colleagues in the Cabinet and Ministry to resolve this issue and assure you that you'll hear good news very…
— Lokesh Nara (@naralokesh) October 22, 2024
నిధులు ఉన్నా చెల్లించకుండా తాత్సారం:
ఏపీలో చివరి విడతగా, గత మార్చి 1న, విద్యాదీవెన నిధులను మాజీ సీఎం జగన్ విడుదల చేశారు. పామర్రులో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తున్నట్టు బటన్ నొక్కారు. విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
ఎన్నికల కోడ్ వచ్చేవరకు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పినా, అవి బటన్ నొక్కడం వరకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఖజానాలో సరిపడా నిధులు ఉన్నా, రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధులను, విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్టు ప్రకటించారు.
జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను మార్చి 1న విడుదల చేశారు. విద్యా దీవెన మరియు వసతి దీవెన పథకాలకు, సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,002 కోట్లను ఖర్చు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో, వసతి దీవెన నిధులు కూడా విడుదల చేస్తున్నట్టు జగన్ తెలిపారు.
ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులను అభ్యసిస్తున్న వారికి రూ.20,000 చొప్పున రెండు విడతల్లో వసతిదీవెన ఫీజులను రీయింబర్స్ చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ఎన్నికల కోడ్‌తో ఆగిన పంపిణీ:
విద్యాదీవెన బటన్ నొక్కినప్పటికీ, తల్లుల ఖాతాల్లో డబ్బులు చేరకపోవడంతో, కాలేజీలు విద్యార్థులపై కొన్నినెలలుగా ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కోర్సులు పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించకుండానే, ఏపీలో ప్రభుత్వం మారింది. జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే విడుదల చేసినా, ఆ డబ్బులు విద్యార్థుల ఖాతాల్లో చేరలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను 2019కు ముందు ఉన్న పేర్లతో మార్చింది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలలో, ఫ్యాకల్టీ, సదుపాయాలు, రేటింగుల ఆధారంగా ఫీజులు విధించబడ్డాయి. మంచి కాలేజీలలో సగటున రూ.77,000 వరకు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా, మొదటి విడతగా రూ.19,000 మాత్రమే విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన ఫీజులు చెల్లించకపోతే డిగ్రీ అర్హత పత్రాలను జారీ చేయమని, మిగతావారిని పరీక్షలకు హాజరు కానివ్వమని కాలేజీలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా, డిగ్రీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య దాదాపు పదిలక్షల మంది ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు:
జగన్ అన్న విద్యా దీవెన ద్వారా రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 9.45 లక్షలుగా ఉంది. ఈ మొత్తం విద్యార్థులలో 93 శాతం మందికి మంచి చేశామంటూ జగన్ తెలిపారు. విద్యాదీవెన మరియు వసతి దీవెన కింద రూ.3500 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.