AP Cabinet Meeting : ఇవాళ ఏపీ మంత్రిమండలి భేటీ.. సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉచిత ఇసుక, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్ కూర్పుపై ఈసందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
- Author : Pasha
Date : 16-07-2024 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
AP Cabinet Meeting : ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉచిత ఇసుక, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్ కూర్పుపై ఈసందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అందులో ఏపీకి ప్రయారిటీ ఇవ్వాలని కోరేందుకు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం సందర్భంగా ఏపీకి సంబంధించి చర్చించాల్సిన అంశాలను కూడా మంత్రివర్గంలో(AP Cabinet Meeting) ఖరారు చేయనున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యల గురించి వారితో చంద్రబాబు చర్చించారు. ఇప్పుడు రెండోసారి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపే ఏకైక ఎజెండాతో చంద్రబాబు హస్తినకు వెళ్తున్నారు. కేంద్ర సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టుల మంజూరులో ఏపీకి ప్రయారిటీ ఇస్తారా లేదా అనేది ఈనెల 23న కేంద్ర బడ్జెట్ ప్రకటనతో తెలిసిపోతుంది.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీ పర్యటనలో ..
ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లగానే కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. 2014 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఏపీ విభజన సమస్యలను పరిష్కరించాలని ఆయనను చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాను సమావేశమై విభజన సమస్యల పరిష్కారంపై చర్చించిన అంశాన్ని కూడా అమిత్‌షాకు వివరించే ఛాన్స్ ఉంది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా సీఎం చంద్రబాబు(CM Chandrababu) కలవనున్నారు. బడ్జెట్‌లో ఏపీకి తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలని కోరనున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేయనున్నారు.