AP Cabinet : ఏపీ క్యాబినెట్ నిర్ణయాలివే..
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం. రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్‌కు ఆమోదం.
- Author : Latha Suma
Date : 04-06-2025 - 5:32 IST
Published By : Hashtagu Telugu Desk
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రమాదకర దిశగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రస్తుతం నేరస్తుల సహాయంతో రాజకీయాలు నడుస్తున్న వాస్తవాన్ని తీవ్రంగా విమర్శించారు. ఒకప్పుడు నేరస్తులను చూస్తేనే రాజకీయ నాయకులు వెనక్కి తగ్గేవారు. కానీ ఇప్పుడు అదే నేరస్తులను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. ప్రజలకు తప్పుదారి చూపే విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: GHMC : వాడీవేడిగా కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం
గత ఏడాది పాలన సుస్థిరంగా సాగిందని, పరిపాలనలో మంత్రుల కృషి ప్రశంసనీయమని సీఎం అభినందించారు. ఇకపై మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలలో మమేకం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ఈ ప్రభుత్వానికి ప్రధాన అజెండా కావాలని స్పష్టంగా తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించక తప్పదు. న్యాయానికి అనుగుణంగా విచారణ జరుపుతాం. గత ప్రభుత్వ అవినీతిపై పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు తాము పాలపడమని, న్యాయం తన దారిలోనే నడవాలన్నది తమ ధోరణి అని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో ఎలాంటి తప్పూ చేయని తెలుగుదేశం నేతలను అకారణంగా జైలుకు పంపారని గుర్తు చేశారు. ఇది న్యాయ విరుద్ధమని వ్యాఖ్యానించారు. పోలవరం, బనకచర్ల వంటి ప్రాజెక్టులపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని సీఎం తెలిపారు. ప్రాజెక్టులకు నిధుల సమీకరణ దిశగా కృషి జరుగుతోందన్నారు. సామూహిక బాధ్యతతో ముందుకు సాగితేనే ప్రజల విశ్వాసం చూరగొనగలమని చంద్రబాబు మంత్రులను ఉత్తేజపరిచారు.