AP BJP: జనాల్లోకి ఏపీ బీజేపీ, పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం
- Author : Balu J
Date : 10-02-2024 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
AP BJP: పల్లెకుపోదాం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా వివిధ స్థాయిల్లోని పార్టీ బాధ్యుతలు గ్రామాలకు వెళ్లనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని క్రోసూరు గ్రామంలో శని, ఆదివారాల్లో ఆమె పర్యటించనున్నారు.
రెండు రోజులపాటు ఇదే గ్రామంలో ఉండి ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి బీజేపీకి అండగా ఉండాలని కోరనున్నారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో బీజేపీతోపాటు బీజేపీ అనుబంధ విభాగాలు పాల్గొనేలా ఇప్పటికే పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు, కార్యకర్తలు ఈ రెండురోజులపాటు గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు పరిధిలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన బీజేపీ.. తాజాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తపరిచే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది.
పల్లెకు పోదాం కార్యక్రంలో భాగంగా గుర్తించిన అంశాలు, సమస్యలను రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి నివేదిక రూపంలో అందించనుంది. ఆయా గ్రామాల్లో పర్యటించే నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమవుతూ వివిధ అంశాలపై చర్చిస్తారు. మరో వైపు స్థానికంగా ఉన్న పరిస్థితులను అవగతం చేసుకోవడంతోపాటు కేంద్ర నాయకత్వం దృష్టికి అక్కడ ఉన్న ఇబ్బందులు, ఇతర అంశాలను తీసుకెళ్లనున్నారు. అవసరమైతే స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలు, నిరసన కార్యక్రమాలను భవిష్యత్‌లో నిర్వహించేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించనుంది.