Andhra’s Prawns Return to Australia : ఆస్ట్రేలియాకు ఎనిమిదేళ్ల తరువాత ఏపీ రొయ్యలు రీ-ఎంట్రీ
Andhra's Prawns Return to Australia : ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉండగా, ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు
- By Sudheer Published Date - 06:54 PM, Wed - 22 October 25

ఎనిమిదేళ్ల పాటు భారత రొయ్యల దిగుమతులపై ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా, మంగళవారం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే తొక్క తీయని (unpeeled) రొయ్యల దిగుమతులకు అనుమతి ఇచ్చింది. 2017 జనవరిలో కొంతమంది భారత ఎగుమతిదారుల రొయ్యలలో వైట్ స్పాట్ వైరస్ గుర్తించడంతో ఆస్ట్రేలియా ఈ ఆంక్షలను విధించింది. ఈ నిర్ణయం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారింది, ఎందుకంటే దేశంలోని రొయ్యల ఉత్పత్తిలో 80% వాటా ఈ రాష్ట్రానిదే. ఇప్పటి వరకు అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడి ఉన్న ఆంధ్ర రొయ్యల రంగానికి, ఆస్ట్రేలియా తలుపులు తిరిగి తెరవడం ఒక కొత్త అవకాశంగా మారింది.
Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!
ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని షరతులతో ఆమోదించింది. రొయ్యలు వ్యాధి లేని ప్రాంతాల (disease-free zones) నుండి ఆర్గానిక్ విధానంలో సేకరించబడాలి, ఫ్రీజ్ చేయబడిన (frozen) రూపంలో ఉండాలి, మరియు పూర్వంలానే Deveined చేసి పంపించాలి. ఈ షరతులు 2017లోనూ అమల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు వాటిని మరింత కఠినతరం చేశారు. ఈ నిర్ణయానికి ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దిగుమతి దారుల లాబీయింగ్ కూడా కారణమైంది. వారు తమ ప్రభుత్వాలను భారతీయ రొయ్యలపై ఉన్న ఆంక్షలను సడలించమని నిరంతరం కోరుతున్నారు. ఆస్ట్రేలియా ఈ సడలింపు నిర్ణయం తీసుకోవడం వలన, భారతీయ సముద్ర ఆహార ఎగుమతిదారులకు కొత్త మార్గం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉండగా, ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. “వైట్ స్పాట్ వైరస్ కారణంగా భారత రొయ్యలపై ఆస్ట్రేలియా విధించిన ఆంక్షలు ఎగుమతిదారులకి పెద్ద అడ్డంకిగా మారాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఆ అడ్డంకి తొలగి, మొదటి రొయ్యల దిగుమతికి అనుమతి లభించడం రొయ్యల రంగానికి ఎంతో పెద్ద అడుగు” అని తెలిపారు. ట్రంప్ పాలనలో అమెరికా 59.72% వరకు పన్నులు విధించడంతో, ఆంధ్ర రొయ్యల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరుచుకోవడం వల్ల, రాష్ట్ర రొయ్యల పరిశ్రమకు నూతన ఉత్సాహం లభించనుంది.