Green Tax : ఏపీ సర్కార్ మరో పన్నుల బాదుడు?
వాహనదారుల నుంచి ఏపీ ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వసూలు చేయాలని చూస్తోంది. కొత్త విధానం తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది.
- By CS Rao Published Date - 04:00 PM, Tue - 30 November 21

వాహనదారుల నుంచి ఏపీ ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వసూలు చేయాలని చూస్తోంది. కొత్త విధానం తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోన్న దాని ప్రకారం పాత వాహనాల మీద భారీగా పన్నులు వసూలు చేయడానికి సిద్ధం అవుతోంది. వ్యక్తిగత, ప్రజా రవాణ వాహనాలకు వేర్వేరుగా పన్నులు విధించడానికి ఫైల్ సిద్ధం అయింది.ఏపీలో ఇకపై పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ ను వసూలు చేయబోతున్నారని టాక్. దాని ప్రకారం రవాణా వాహనాలకు ఏడేళ్లు దాటితే ఏటా రూ. 4వేలు , పదేళ్లు దాటితే ఏడాదికి రూ. 5 వేలు గ్రీన్ ట్యాక్స్ ,12 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.6 వేలు గ్రీన్ ట్యాక్స్ వేయనున్నారు. అదే మోటారు సైకిళ్లు 15 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.2 వేలు ట్యాక్స్ , 20 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ , కార్లు, జీపులు వగైరా వాటికి 15 ఏళ్లు దాటితే రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ , 20 ఏళ్లు దాటిన కార్లు, జీపులకు రూ.10 వేలు గ్రీన్ ట్యాక్స్ వేయాలని సిద్ధం ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇక కొత్త వాహనాలకు రూ.50 వేలు విలువ పైబడిన బైక్‍లపై 9 నుంచి 13 శాతం పన్ను పెంచాలని జగన్ సర్కార్ భావిస్తోంది. రూ.20 లక్షలకు మించిన వాహనాలపై 12 నుంచి 18 శాతం పన్ను పెంచాలని సిద్ధం అవుతోంది.
ప్రభుత్వ తాజా పన్నుల విధానం చూసిన వాహనదారులు మండిపడుతున్నారు. అధికారికంగా ఉత్వర్వులు వెలువడిన తరువాత వాహనదారుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుందోనని రవాణశాఖ అంచనా వేస్తోంది. మొత్తం మీద మరో బాదుడుకు జగన్ సర్కార్ సిద్ధం అవుతోందన్నమాట.