AP Power Sector : ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగం.. నైపుణ్యభరిత నాయకత్వం, హరిత ఇంధనంపై ఫోకస్‌తో మున్ముందుకు
ఇటీవలే ముంబైలో జరిగిన కేంద్ర విద్యుత్ శాఖ సమావేశంలో ఏపీ ఇంధన శాఖ(AP Power Sector) మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు.
- By Dinesh Akula Published Date - 04:59 PM, Mon - 5 May 25

AP Power Sector : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. దాన్ని అప్పుల భారం వెంటాడుతోంది. ఈవిషయం తెలిసినప్పటికీ విద్యుత్ రంగాన్నే అత్యంత ప్రాధాన్య అంశంగా ఏపీలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వం “పవర్ సెక్టార్ రీఫార్మ్స్ 3.0” పేరుతో కొత్త సంస్కరణలను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా పకడ్బందీ ఆర్థిక నియమావళి, నిర్వహణ సామర్థ్యంలో మెరుగుదల, పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడం వంటి అంశాల ప్రాతిపదికన రాష్ట్ర విద్యుత్తు రంగానికి జవసత్వాలను అద్దాలని చంద్రబాబు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read :Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?
నైపుణ్యభరిత నాయకత్వంపై ఫోకస్
విద్యుత్తు రంగంలో నైపుణ్యం కలిగిన నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అనేది “పవర్ సెక్టార్ రీఫార్మ్స్ 3.0” కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఎన్‌టీపీసీ (NTPC), భారతీయ రైల్వేలు వంటి ప్రముఖ సంస్థల నుంచి అనుభవజ్ఞులను విద్యుత్తు ఉత్పత్తి, ప్రసారం, పంపిణీకి సంబంధించిన సంస్థల్లో కీలక స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 140 మందికిపైగా అర్హుల్ని పరిశీలించిన తర్వాత, 16 కీలక నియామకాలను ప్రభుత్వం చేసింది. నైపుణ్యత ఆధారిత, పారదర్శక నియామక విధానానికి ఇది ప్రతీక.
Also Read :India Vs Pakistan : రక్షణశాఖ కార్యదర్శితో మోడీ భేటీ.. రేపో,మాపో పీఓకేపై దాడి ?
నైపుణ్యభరిత నాయకత్వ స్థానాలు పొందింది వీరే..
- ఆబిద్ రెహమాన్.. SBIలో జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి నుంచి సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయి దాకా పనిచేశారు. ఆయన APSPDCL (ప్రాంతీయ పంపిణీ సంస్థ)లో ఆర్థిక విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.
- ఎస్. వెంకటేశ్వర్లుకు SBIలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈయన సెంట్రల్ డిస్కం డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్‌గా ఎంపికయ్యారు.
- కె. సీతారామరాజు భారతీయ రైల్వే ఖాతాల విభాగంలో పనిచేశారు. APGENCOలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల బాధ్యతల్ని ఆయన చేపట్టారు.
- కె. శ్రీనివాస్, ఎన్‌టీపీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. జిందాల్ పవర్‌లోనూ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన పనిచేశారు. అందుకే APPDCL (ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) డైరెక్టర్‌గా నియమింంచారు.
- ఈ నియామకాల్లో నారా లోకేష్ (ఉద్యోగ కల్పనపై మంత్రుల బృందం ఛైర్మన్) కీలక పాత్ర పోషించారు. రాజకీయ సంబంధాల కంటే నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ హయాంలో భారీగా పెరిగిన అప్పులు
2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి ఏపీలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థల అప్పులు రూ.62,826 కోట్లు. 2023-2024 నాటికి ఆ అప్పులు కాస్తా రూ. 1,12,422 కోట్లకు పెరిగాయి. అంటే 79 శాతం మేర అప్పులు పెరిగాయి. గత వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో ఆర్థిక, నిర్వహణపరమైన లోపాల వల్లే విద్యుత్ సంస్థల అప్పులు ఇంతలా పెరిగాయని పేర్కొంటూ ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదికను విడుదల చేసిన తర్వాతే.. విద్యుత్ సంస్థల్లో నిపుణులైన 16 మందికి కీలక బాధ్యతలను అప్పగించారు. తద్వారా దిద్దుబాటు చర్యలను చంద్రబాబు మొదలుపెట్టారు.
ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తూ.. సంస్కరణలు చేస్తున్నాం: గొట్టిపాటి రవికుమార్, ఏపీ ఇంధన శాఖ మంత్రి
ఇటీవలే ముంబైలో జరిగిన కేంద్ర విద్యుత్ శాఖ సమావేశంలో ఏపీ ఇంధన శాఖ(AP Power Sector) మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ‘‘ఏపీ ప్రభుత్వం హరిత ఇంధన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోంది. పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా డిస్కంలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తాం. రాష్ట్రంలోని బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని 1,000 మెగావాట్ల నుంచి 2,000 మెగావాట్లకు పెంచుతాం. ఈక్రమంలో మాకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలి. మా రాష్ట్రానికి పంపు సెట్ల మంజూరు అనుమతులను 1 లక్ష నుంచి 4.5 లక్షలకు పెంచాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కాలంలో విద్యుత్తు సంస్థలు రూ. 17,000 కోట్ల నుంచి రూ. 67,000 కోట్ల అప్పులోకి జారుకున్నాయి. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 11,352 కోట్ల బకాయిలను చెల్లించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించింది’’ అని మంత్రి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యసో నాయక్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో డిస్కంల నిర్వహణ, అప్పుల వసూలు, ప్రోత్సాహక పథకాలపై చర్చించారు.
ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం చంద్రబాబు హయాంలో గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసిన పవర్ సెక్టార్ రిఫార్మ్స్ 1.0 (1995–2004), పవర్ సెక్టార్ రిఫార్మ్స్ 2.0 (2014–2019) ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంధన స్వావలంబనలో ముందంజ వేసింది. ఇప్పుడు 3.0 ద్వారా పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యతను పెంచారు. స్మార్ట్ మీటర్లు, బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చారు. విద్యుత్ చౌర్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నారు. ఏపీ ప్రభుత్వ విద్యుత్ సంస్థలపై ఉన్న రూ.1.12 లక్షల కోట్ల అప్పులను పూర్తిగా తీర్చగలమా అనే సందేహం ఉన్నప్పటికీ.. నైపుణ్యంతో కూడిన నాయకత్వం, నిజాయితీతో కూడిన పాలనతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. హరిత ఇంధన విభాగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర విద్యుత్తు రంగానికి కూటమి సర్కారు కొత్త దిశను చూపిస్తోంది. ఈ విధానం మన దేశంలోని ఇతర రాష్ట్రాలకూ ఒక ఆదర్శంగా మారే అవకాశం ఉంది.