ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం
- Author : Vamsi Chowdary Korata
Date : 17-12-2025 - 1:08 IST
Published By : Hashtagu Telugu Desk
Akkineni Nagarjuna : టాలీవుడ్ హీరో నాగార్జున, కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాల ఎంతో మందికి బంగారు భవిష్యత్తును అందించిందని, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందని కొనియాడారు. గుడివాడ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
- హీరో నాగార్జున పెద్ద మనసు చాటుకున్నారు
- గుడివాడ ఏఎన్నార్ కాలేజీకి రూ.2 కోట్లు విరాళం
- విద్యార్థుల స్కాలర్‌షిప్ కోసం విరాళం ప్రకటన
టాలీవుడ్ హీరో నాగార్జున ఏపీలోని కాలేజీకి రూ2.కోట్లు విరాళం ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల్లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. కళాశాల అభివృద్ధికి ఏఎన్నార్ ఎంతో కృషి చేశారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. సినిమాకు రూ. 5వేలు వచ్చే 1959లోనే ఈ కాలేజీకి ఏఎన్నార్ రూ.లక్ష విరాళం అందించారని తెలిపారు.
గుడివాడ రావడం భావోద్వేగంగా ఉందని.. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు హీరో నాగార్జున. రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు.. చదువు అంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్తును అందించారన్నారు. తన తండ్రి స్థాపించిన ఏ సంస్థ అయినా తనకు ఎంతో ప్రత్యేకం అన్నారు. తన తరఫున, తన కుటుంబ సభ్యుల తరఫున ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామన్నారు.
నాగార్జున ఏఎన్నార్ కాలేజీలో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం తన కుటుంబం తరఫున రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటునందించాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈ భారీ విరాళాన్ని ప్రకటించారు. మనుషులు శాశ్వతం కాదని.. వారు చేసే పనులే శాశ్వతమన్నారు. ఏఎన్ఆర్ కాలేజీలో చదివిన చాలామంది విద్యార్థులు దేశ, విదేశాల్లో, ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. గుడివాడలో తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నారు.
ఏఎన్ఆర్ కాలేజీ మహోన్నత ఆలోచనతో ఏర్పాటు చేశారన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్. 75ఏళ్లుగా వేలాది మందికీ మంచి భవిష్యత్తును ఇవ్వడమే కాక.. దేశానికి గొప్ప పౌరులను అందించారన్నారు. తాను కూడా ఈ ఏఎన్నార్ కాలేజీలో చదివానని.. హైకోర్టు జస్టిస్ స్థాయికి ఎదిగానన్నారు. ఈ కాలేజీతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఈ నెల 16న గుడివాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గురువారం ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఈ కాలేజీ 1950లో స్థాపించగా.. అక్కినేని నాగేశ్వరరావు 1959లో రూ.లక్ష విరాళం ఇవ్వడంతో ఏఎన్నార్ కాలేజీగా పేరు పెట్టారు. ఈ కాలేజీ ముందు 15 ఎకరాల్లో ఉంది.. ఆ తర్వాత మరో 10 ఎకరాలకు విస్తరించారు. 75 ఏళ్లగా ఎంతో మందికి విద్యను అందించింది.. ఇక్కడ చదివినవారిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినిమా ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఈ కాలేజీలో ప్రారంభంలో ఆర్ట్స్ కోర్సులు మాత్రమే ఉన్నాయి.. ఆ తర్వాత ఎంకామ్, సైన్స్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. 2018-2019లో అటానమస్ కాలేజీగా న్యాక్ ఏ గ్రేడ్ కూడా వచ్చింది. ఈ కాలేజీని ప్రభుత్వానికి అప్పగించాలని ఒత్తిడి వచ్చినా సరే దాతలు, పూర్వ విద్యార్థులు అండతో కొనసాగుతోంది. ఈ కాలేజీ అభివృద్ధికి ఎంతోమంది విరాళాలు అందించారు.. దీనికి గుర్తుగా కాలేజీలో బ్లాక్‌లకు వారి పేర్లే పెట్టారు.