Polavaram: పోలవరాన్ని కేంద్రానికి అప్పగించండి – బీజేపీ ఎంపీ జీవీఎల్
పోలవరం ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉండాలనుకున్నఏపీ ప్రభుత్వం పనిని పూర్తి చేయడంలో విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
- Author : Hashtag U
Date : 19-12-2021 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
పోలవరం ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉండాలనుకున్నఏపీ ప్రభుత్వం పనిని పూర్తి చేయడంలో విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రీయింబర్స్‌మెంట్ పొందడానికి పని చేసిన నివేదికలను సకాలంలో సమర్పించడంలో విఫలమైందని..దీంతో ఖర్చు రూ. 55,000 కోట్లకు పెరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సక్రమంగా అమలు చేసేందుకు కేంద్రానికి అప్పగించే స్వేచ్ఛ ఉందన్నారు. రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి చూడగలుగుతున్నారంటే అన్నింటికీ కేంద్రం నిధులు ఇచ్చిందని…రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఏమాత్రం ఖర్చు చేయలేదన్నారు.
2014 నుండి 2020 వరకు కొత్త రోడ్లు వేయడానికి కేంద్రం రూ. 25,000 కోట్లు ఖర్చు చేసిందని…రహదారుల మొత్తం పొడవును దాదాపు రెట్టింపు చేసిందని జీవీఎల్ తెలిపారు. జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాయలసీమలో ఆగిపోయిన ఆరు నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు పొందేందుకు ఎందుకు ప్రత్యేక ఆసక్తి చూపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సమర్పించాల్సి ఉన్నా వాటిని సమర్పించలేదన్నారు. ప్రత్యేక కేటగిరీ హోదా వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం ఉండదని.. అయితే రెవెన్యూ లోటు భర్తీ పేరుతో కేంద్రం ఇప్పటివరకు రూ.23,000 కోట్లు ఇచ్చిందన్నారు.ప్రస్తుత ఏడాదికి మరో రూ.11,000 కోట్లు మంజూరు చేసిందని… ఇది చాలా ఎక్కువని అన్నారు