Jawahar babu : ఎంపీడీవో పై దాడి నిందితులకు 14 రోజుల రిమాండ్
వీరు ముగ్గురినీ కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- Author : Latha Suma
Date : 28-12-2024 - 8:34 IST
Published By : Hashtagu Telugu Desk
Jawahar babu : ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై అదే ప్రాంతానికి చెందిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి కేసులో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు భయ్యారెడ్డి, వెంకట రెడ్డికి కూడా రిమాండ్ విధించారు. వీరు ముగ్గురినీ కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇక..కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న జవహర్ బాబును ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. జవహర్ బాబు పై దాడి ఘటన పై ఆరా తీశారు. ఉద్యోగులపై దాడులు చేస్తే.. తీవ్ర చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.
కాగా, ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి ఎంపీడీవోని అడగడంతో ఎంపీపీ లేనిదే గది తాళాలు ఇచ్చేది లేదని జవహర్ బాబు చెప్పారు. అయితే తమకే ఎదురు చెబుతావా అంటూ ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు ఒక్కసారిగా ఎంపీడీవోపై పిడి గుద్దులు కురిపించారు. అనంతరం దాడి చేసిన వైసీపీ నాయకులు కేకలు వేసుకుంటూ కార్యాలయం బయటికి వచ్చారు. దాడి చేసిన సమయంలో పోలీసులు కూడా ఆ ప్రాంతంలో ఉండడంతో వారందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు.
Read Also: AP Govt : 108, 104 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్