Kuwait Airport: అమెరికా-ఇరాన్ యుద్ధం..కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి
- Author : Vamsi Chowdary Korata
Date : 03-06-2026 - 2:41 IST
Published By : Hashtagu Telugu Desk
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్‌లోని ఒక ప్యాసింజర్ టెర్మినల్ తీవ్రంగా దెబ్బతింది.
ఎయిర్‌పోర్ట్‌లోని టీ1 ప్యాసింజర్ భవనంపై ఇరాన్‌కు చెందిన డ్రోన్లు దాడి చేశాయి. విమానాశ్రయ భవనానికి భారీగా నష్టం వాటిల్లినట్లు కువైట్ ప్రభుత్వం వెల్లడించింది. దాడి నేపథ్యంలో అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి, అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు.
ఈ దాడిని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, బ్రిగేడియర్ జనరల్ సౌద్ అబ్దుల్‌అజీజ్ అల్-ఒతైబీ మాట్లాడుతూ, “ఇది ఇరాన్ చేసిన నేరపూరిత దురాక్రమణ. శత్రు డ్రోన్లు నేరుగా ప్రయాణికుల భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడి వల్ల భవనానికి తీవ్ర నష్టం కలగడంతో పాటు పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాం” అని తెలిపారు.
పరిస్థితిని భద్రతా దళాలు నిశితంగా గమనిస్తున్నాయని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడుల్లో తమ సైనికులకు ఎలాంటి నష్టం జరగలేదని ఇరాన్ స్పష్టం చేసింది. దాడి సమయంలో కువైట్, బహ్రెయిన్ దళాలు కూడా తమ రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశాయి.
ఫిబ్రవరిలో మొదలైన ఘర్షణల తర్వాత, ఇటీవలే కువైట్ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజా దాడితో గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. కువైట్ అధికారులు సైనిక బలగాలను హై అలర్ట్‌లో ఉంచారు. అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసుల మార్గాలను మళ్లిస్తున్నాయి.