US On Ukraine: మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగినా హత్యపై మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.
- By Naresh Kumar Published Date - 03:14 PM, Wed - 24 August 22

పుతిన్ గురువు కూతుర్ని హత్య చేసింది ఎవరు..? ఇది ఉక్రెయిన్ కుట్రే అంటోంది మాస్కో.
కాదు.. కాదు మాకు సంబంధం లేదు అంటోంది కీవ్. మరి డార్యాను చంపింది ఎవరు..? ఉక్రెయిన్ విడిచి రావాలని
తమ పౌరులకు అమెరికా ఎందుకు ఆదేశాలిచ్చింది..?
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె డార్యా డుగినా హత్యపై మాస్కో, కీవ్ మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇది ఉక్రెయిన్ పనేనన్న మాస్కో ఆరోపణలను జెలెన్‌స్కీ ప్రభుత్వం ఖండించింది. ఈ హత్య వెనుక రష్యా స్పెషల్ సర్వీసెస్ హస్తం ఉందంటూ ఎదురుదాడి చేసింది. ఉక్రెయిన్ దళాలు ఇలాంటి బాంబింగ్స్ చేయవన్నారు ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ ఒలెక్సీ డెనిలోవ్. ఎఫ్ఎస్బీ ఈ సీక్రేట్ ఆపరేషన్ చేయించి.. కీవ్‌పై నెడుతోందని ఆరోపించారు. డార్యా డుగిన్ తండ్రి అలెగ్జాండర్ రష్యాలో పలుకుబడి ఉన్న వ్యక్తి. పుతిన్‌కు గురువుగా పేరుంది. ఆయన సలహాతోనే ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్య ప్రారంభించారని అంటారు. వాస్తవానికి అలెగ్జాండర్‌ను మట్టుబెట్టేందుకు ఈ దాడి జరిగిందని.. పొరబాటున డార్యా మరణించారనే అనుమానాలున్నాయి. తండ్రి, కుమార్తె ఒకే కారులో ఇంటికి వెళ్లాలి. చివరి నిమిషంలో వేరే కారులోకి మారడంతో ఆయనకు ముప్పు తప్పింది. 29 ఏళ్ల డార్యా జర్నలిస్ట్. రష్యా జాతీయ టీవీ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసేవారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థిస్తూ అనేక కథనాలు ప్రసారం చేశారు. వ్యాసాలు రాశారు. డార్యా డుగిన్ హత్యను ఖండించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆమెకు మరణానంతరం ఆర్డర్ ఆఫ్ కరేజ్ పురస్కారం ప్రకటించారు. అమెరికా ఆంక్షలు విధించిన రష్యన్లలో డార్యా కూడా ఉన్నారు. కాగా, తాజాగా మరోసారి అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు జారీచేసింది. తక్షణమే ఉక్రెయిన్ విడిచి రావాలని ఆదేశించింది. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. రష్యా మరిన్ని దాడులు చేసే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది