Google : నోరూరిస్తోన్న గూగుల్ ఇడ్లి డూడుల్.. మీరు ఓ లుక్కేయండి !
- By Vamsi Chowdary Korata Published Date - 11:38 AM, Sat - 11 October 25

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ‘డూడుల్’ గురించి అందరికి తెలుసు కదా..! రోజుకో థీమ్‌తో స్పెషల్‌గా కన్పిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు నివాళిగానో.. ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూనే డూడుల్‌ను క్రియేట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు (అక్టోబరు 11) గూగుల్ డూడుల్ మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకో తెలుసా..చూడండి ? ఈసారి దీన్ని దక్షిణాది వంటకమైన ‘ఇడ్లీ’ ప్రత్యేకంగా (Google Idli Doodle) గూగుల్ లో రూపొందించారు.
ఫుడ్ థీమ్‌లో భాగంగా ఈ రోజు గూగుల్ డూడుల్ (Google Doodle)లో ‘ఇడ్లీ వేడుక’ చేశారు. ఈ అల్పాహారన్నీ ప్రతిబింబించేలా Google అక్షరాల్లో చూపించారు. ఇడ్లీ (Idle) పిండికి కావాల్సిన పదార్థాలు, దాన్ని నానబెట్టడం, ఆ తర్వాత ఇడ్లీ రేకుల్లో పెట్టి ఉడికించడంతో పాటు సాంబార్, కారం పొడి, చట్నీతో వడ్డించే విధానాన్ని అందులో చూపించారు. ప్రస్తుతం ఈ డూడుల్ ను నెటిజన్లను, ముఖ్యంగా భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కాగా.. గూగుల్ (Google) డూడుల్‌లో భారతీయ వంటకాలను పెట్టడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల కిందట పానీపూరీ ప్రపంచ రికార్డుకు గుర్తుగా.. గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. దీంతో పాటు పానీపూరీ ఆకృతుల్లో ఓ ఇంటరాక్టివ్ గేమ్‌ను కూడా పెట్టింది. అప్పట్లో అది తెగ వైరల్ అయ్యింది.ఇప్పుడు ఇడ్లీ డూడుల్ కూడా అంతే వైరల్ అవుతూ ఉంది