Earth Quakes : తైవాన్‌లో మరో రెండు భూకంపాలు.. అర్ధరాత్రి ఏమైందంటే..
Earth Quakes : తైవాన్‌లో అర్ధరాత్రి వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి.
- Author : Pasha
Date : 27-04-2024 - 7:40 IST
Published By : Hashtagu Telugu Desk
Earth Quakes : తైవాన్‌లో అర్ధరాత్రి వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2:21 గంటలకు తైవాన్ తూర్పు తీరంలోని హువాలిన్ కౌంటీలో మొదటి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. మొదటి భూకంపం వచ్చిన అరగంట తర్వాత రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో మరిన్ని భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే అక్కడ జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. తైవాన్‌లోని హువాలిన్, యిలాన్, నాంటౌ, హ్సించు, తైచుంగ్, టాయోయువాన్, న్యూ తైపీ పట్టణాలలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం హువాలిన్ కౌంటీకి 23 కిలోమీటర్ల దూరంలో, ఫిలిప్పీన్ సముద్రంలో 24.9 కిలోమీటర్ల లోతులో ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ (CWA) వెల్లడించింది. రెండోసారి సంభవించిన ప్రకంపనల భూకంప కేంద్రం హువాలిన్ తీర సముద్రంలో 18.9 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది.
We’re now on WhatsApp. Click to Join
అర్ధరాత్రి భూకంపం వచ్చినప్పుడు తైవాన్‌లో(Earth Quakes) అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. భూప్రకంపనలను ఫీల్ అయిన వారు నిద్రలో నుంచి లేచి ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ నెల ప్రారంభంలోనే (ఏప్రిల్ 3న) తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. గత 25 ఏళ్లలో అదే అత్యంత తీవ్రమైన భూకంపం. ఏప్రిల్ 23న కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెల్లవారుజామున 6.1, 6.0 తీవ్రతతో రెండు భూకంపాలు వచ్చాయి. ఏప్రిల్ 24న ఉదయం 5.8 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ రెండు తేదీల్లో తైవాన్‌లో 80 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని అంటున్నారు. ఆ రెండు తేదీల్లో వచ్చిన భూకంపంలో ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ 3 నుంచి ఇప్పటివరకు తైవాన్‌లో దాదాపు 1100 భూప్రకంపనలు వచ్చాయని నిపుణులు చెబుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అక్కడి ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తైవాన్ దేశం ఫిలిప్పైన్ సముద్రం, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ జంక్షన్ మధ్యలో ఉంది. దీంతో ఆ దేశానికి భూకంపాల రిస్క్ ఎక్కువ. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలలో తైవాన్ ఒకటి. అక్కడి యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్‌లలో నిరంతరం కదలికలు, సర్దుబాట్లు జరుగుతుంటాయి. అందువల్లే తైవాన్‌కు భూకంపాల రిస్క్ అంతగా పెరిగింది.