Palestine Vs Hamas : హమాస్ దాడులతో మాకు సంబంధం లేదు.. పాలస్తీనా అధ్యక్షుడి ప్రకటన
Palestine Vs Hamas : ‘‘గాజాలోని హమాస్ మిలిటెంట్ల చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవు ’’ అని పేర్కొంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 09:57 AM, Mon - 16 October 23

Palestine Vs Hamas : ‘‘గాజాలోని హమాస్ మిలిటెంట్ల చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవు ’’ అని పేర్కొంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ యాక్టివిటీతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్వో) విధివిధానాలే తమ దేశాన్ని ప్రతిబింబిస్తాయని అబ్బాస్ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడుల్ని ఆయన ఖండించారు. బందీలుగా ఉన్న పౌరులు, ఖైదీలను ఇరు వర్గాలు విడుదల చేయాలని సూచించారు. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ సంభాషణ ముగిసిన తర్వాత పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తాజా ప్రకటనను విడుదల చేయడం గమనార్హం. ఇక మహమూద్ అబ్బాస్ ప్రకటనపై పాలస్తీనా ప్రజలు భగ్గుమంటున్నారు. బైడెన్ ఫోన్ కాల్ కు భయపడి ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన చైనా.. వెంటనే శాంతి చర్చలు జరపాలని ఇజ్రాయెల్, హమాస్ లకు సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు గ్రౌండ్ ఆపరేషన్ కు ఇజ్రాయెల్ రెడీ అయింది. గాజా బార్డర్ లో 3.50 లక్షల మంది రిజర్వ్ బలగాలు, వందలాది యుద్ధ ట్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. హమాస్‌కు దాదాపు 30వేల మంది ఫైటర్లు ఉన్నారు. వారికి యుద్ధ ట్యాంకులుగానీ, వైమానిక దళంకానీ లేవు. గ్రౌండ్ ఆపరేషన్ మొదలైతే ఇజ్రాయెల్ ఈజీగా గాజా అర్బన్ సెంటర్, గాజా సిటీలను స్వాధీనం చేసుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒకవేళ గాజాలో హమాస్ మందు పాతరలను అమర్చి ఉంటే.. వాటిని దాటుకుని లోపలికి వెళ్లడం ఇజ్రాయెల్ సైన్యానికి కత్తిమీద సాము లాంటిదే. అందుకే ఉత్తర గాజాలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేసి, దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ వార్నింగ్స్ (Palestine Vs Hamas) ఇస్తోంది.