Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమం.. ఆయన నేపథ్యం ఇదీ..
పోప్(Pope Francis) ఫిబ్రవరి 14న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరారు.
- By Pasha Published Date - 07:07 AM, Sun - 23 February 25

Pope Francis: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమించింది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు రోమ్‌లోని గెమిల్లీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సరిగ్గా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉండటంతో ప్రస్తుతం పోప్‌కు హై ఫ్లో ఆక్సిజన్‌ను అందిస్తున్నట్లు తెలిసింది. న్యూమోనియాతో పాటు సంక్లిష్టమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో పోప్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందన్నారు. ‘శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచింది. ఈ సమయంలో ఏమీ చెప్పలేం’ అని వాటికన్ ఓ ప్రకటన విడుదల చేసింది. పోప్ ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్బొన్ చెప్పారు. పోప్(Pope Francis) ఫిబ్రవరి 14న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరారు. పోప్‌కు వివిధ వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించారు. దీంతో ఆయనకు రక్తాన్ని మార్చారు.
Also Read :Shaktikanta Das : శక్తికాంత దాస్‌కు కీలక పదవి
పోప్ ఫ్రాన్సిస్ ఎవరు ?
- దక్షిణార్ధ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తి ఫ్రాన్సిస్.
- ఆయన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించారు.
- పోప్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో.
- పోప్ ఫ్రాన్సిస్ యుక్త వయసులో ఉండగానే ఆయనలో ప్లూరిసీ డెవలప్ అయింది. దీంతో 21 ఏళ్ల వయస్సులో ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించారు.
- 1998లో బ్యూనస్ ఎయిర్స్ నగర ఆర్చిబిషప్‌గా ఫ్రాన్సిస్ నియమితులు అయ్యారు.
- 2001లో ఫ్రాన్సిస్‌ను కార్డినల్‌గా నియమిస్తూ నాటి పోప్ జాన్ పాల్-2 ప్రకటన చేశారు.
- 2001 డిసెంబరులో అర్జెంటీనాలో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో అర్జెంటీనా చర్చికి ఫ్రాన్సిస్ సారథ్యం వహించారు. దీంతో అక్కడి పలు రాజకీయ పార్టీలు ఫ్రాన్సిస్‌ను వ్యతిరేకించాయి.
- 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ క్రైస్తవ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు.
- 2023 మార్చి నెలలో బ్రాంకైటిస్ కారణంగా పోప్ మూడు రోజుల పాటు ఆస్పత్రిలో గడిపారు.
- పోప్ ఫ్రాన్సిస్ గత 12 ఏళ్లుగా రోమన్ క్యాథలిక్ చర్చ్‌కు నాయకత్వం వహిస్తున్నారు.