Pakistan : భగత్ సింగ్ కు అత్యున్నత పౌరగౌరవాన్ని ఇవ్వాలని పాకిస్థాన్ ఫౌండేషన్ డిమాండ్..!!
భారతీయుల గుండెల్లో కలకాలం నిలిచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరు భగత్ సింగ్. దేశం కోసం 23ఏళ్ల వయస్సుల్లోనే తన ప్రాణాలను అర్పించిన వీరుడు.
- By hashtagu Published Date - 04:48 AM, Fri - 30 September 22

భారతీయుల గుండెల్లో కలకాలం నిలిచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరు భగత్ సింగ్. దేశం కోసం 23ఏళ్ల వయస్సుల్లోనే తన ప్రాణాలను అర్పించిన వీరుడు. అలాంటి అమరవీరుడు భగత్ సింగ్‌కు అత్యున్నత పౌర గౌరవాన్ని అందించాలని పాకిస్తాన్‌కు చెందిన ఫౌండేషన్ భారత్ , పాకిస్తాన్‌లను డిమాండ్ చేసింది. విప్లవ నాయకుడి 115వ జయంతిని పురస్కరించుకుని, ఉపఖండంలోని ప్రజల కోసం అతని ధైర్యాన్ని, త్యాగాన్ని గౌరవించాలని ఫౌండేషన్ పేర్కొంది.
భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ బుధవారం లాహోర్ హైకోర్టు ప్రాంగణంలో భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాయవాదులు కేక్ కట్ చేసి భగత్ సింగ్, ఆయన సహచరులు శివరామ్ హరి రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి ప్రసంగిస్తూ భగత్ సింగ్‌కు నివాళులర్పించారు. భగత్ సింగ్‌కు అత్యున్నత పౌర గౌరవాన్ని అందించాలని భారత్, పాకిస్తాన్ ప్రధానులను కోరారు. సామాజిక, ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు, ఇరుదేశాల మధ్య శాంతిని పెంపొందించేందుకు సులభ వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌కు అమరవీరుడు భగత్ సింగ్ పేరు పెట్టాలనే డిమాండ్‌ను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీర్ కలీమ్ అహ్మద్ పునరుద్ఘాటించారు.