Terrorist Attack : రష్యాలోని ప్రార్థనా మందిరాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి
రష్యాలోని డాగేస్థాన్ ప్రాంతంలో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది.
- By Pasha Published Date - 08:02 AM, Mon - 24 June 24

Terrorist Attack : రష్యాలోని చెచెన్యాలో ఉన్న తూర్పు ప్రాంతం డాగేస్థాన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. మఖచ్‌కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలు లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరం, ఒక పోలీసుల పోస్టుపై కాల్పులు జరిగాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఈ ఘటనల్లో 15 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో సామాన్య పౌరులతో పాటు పోలీసులు కూడా ఉన్నారని డాగేస్థాన్ గవర్నర్ సెర్గీ మెలికోవ్ సోమవారం ఉదయం వెల్లడించారు. ఉగ్రదాడిలో ఇంకో 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేర్పించారు.
We’re now on WhatsApp. Click to Join
రష్యా భద్రతా బలగాలు నిర్వహించిన కౌంటర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆరుగురు సాయుధ దుండగులను రష్యా సైన్యం మట్టుబెట్టింది. ప్రస్తుతానికి ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముగిసిందని రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ (NAC) ప్రకటించింది. ఈ ఘటన ఉగ్రవాదుల పనేనని వెల్లడించింది. ఘటన జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం పూర్తిగా భద్రతా బలగాల అదుపులో ఉన్నాయని తెలిపింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో డాగేస్థాన్‌లో జూన్ 24, 25, 26 తేదీలను సంతాప దినాలుగా పాటిస్తామని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.
Also Read : Free Bus: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు
ఆదివారం రోజు చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలలో ప్రార్థనలు జరగడానికి దాదాపు 45 నిమిషాల ముందు ఈ ఉగ్రదాడి జరిగిందని తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారమే ఉగ్రవాదులు ఈ దాడి చేశారు అనేందుకు ఇదే కీలక ఆధారమని రష్యా భద్రతా సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల ప్రేరణ వల్లే ఉగ్రవాదులు ఈ దాడి చేశారని పేర్కొంటూ రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఉగ్రదాడి చేసిన వారికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉండి ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌పై ఉగ్రదాడి జరిగిన టైంలో రష్యా నిఘా సంస్థలు డాగేస్థాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి, నలుగురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.