Om Shanti : డెమొక్రటిక్ పార్టీ సభలో ‘ఓం శాంతి’.. కమలకు మద్దతుగా పూజారి రాకేశ్ భట్ ప్రసంగం
ఈతరుణంలో చికాగోలో నిర్వహించిన కీలకమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో మూడోరోజున ఒక హిందూ పూజారి ప్రసంగించారు.
- By Pasha Published Date - 10:11 AM, Thu - 22 August 24

Om Shanti : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. చాలా కీలకమైన అమెరికా రాష్ట్రాల్లో ఇప్పటికే ట్రంప్‌పై కమల పైచేయి సాధించారు. ఈతరుణంలో చికాగోలో నిర్వహించిన కీలకమైన డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో మూడోరోజున ఒక హిందూ పూజారి ప్రసంగించారు. ఆయన పేరు రాకేశ్ భట్. ప్రస్తుతం మేరీల్యాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా సేవలు అందిస్తున్నారు. రాకేశ్ భట్ తన ప్రసంగాన్ని “ఓం శాంతి శాంతి” మంత్రాలతో ప్రారంభించగానే సమావేశానికి హాజరైన వారంతా చప్పట్లు కొట్టారు. అమెరికా రాష్ట్రాలన్నీ ఐక్యంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆయన వేద ప్రార్థనలు చేశారు. అమెరికన్ల మధ్య విభేదాలు ఎలా ఉన్నప్పటికీ, దేశం విషయానికొస్తే ఐక్యంగా నిలవాలని రాకేశ్ పిలుపునిచ్చారు. ‘‘మనం ఐక్యంగా ఉందాం. మన మనస్సులు కలిసి ఆలోచించనివ్వండి. మన హృదయాలు ఒక్కటిగా సాగనివ్వండి. అందరం సమాజాభివృద్ధి కోసం మనల్ని శక్తివంతం చేద్దాం. తద్వారా మన దేశం గర్వపడేలా చేద్దాం’’ అని రాకేశ్ భట్(Om Shanti) తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం. ఈ వైదిక భావనను విశ్వసించే నాయకురాలినే మనం ఎన్నుకుందాం’’ అంటూ కమలా హ్యారిస్‌కు రాకేశ్ భట్ తన మద్దతును ప్రకటించారు. ‘‘సత్యమే మా పునాది. అది ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మమ్మల్ని అవాస్తవం నుంచి వాస్తవానికి, చీకటి నుంచి వెలుగులోకి, మరణం నుంచి అమరత్వం వైపునకు నడిపించేది సత్యమే. ఓం శాంతి శాంతి శాంతి’’ అని రాకేశ్ భట్ చెప్పుకొచ్చారు. రాకేశ్ భట్ బెంగళూరు వాస్తవ్యులు. ఈయనకు హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, తుళు భాషలు వచ్చు. ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమంలో శిక్షణ పొందారు. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఆయన వేదాలు నేర్చుకున్నారు. బెంగళూరులోని ఒస్టీన్ కళాశాల నుంచి తన ఇంగ్లీష్,కన్నడ డిగ్రీలను పొందారు. జయచామరాజేంద్ర కళాశాల నుంచి తన సంస్కృత డిగ్రీని పొందారు.