Donald Trump Tariffs : ట్రంప్ దెబ్బకు రష్యాకు షాక్ ఇచ్చిన భారత్
Donald Trump Tariffs : రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుండటం, దానికి జాతీయ ప్రయోజనాల పేరు చెప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు
- By Sudheer Published Date - 11:00 AM, Fri - 1 August 25

ఉక్రెయిన్‌కు తాము ఎంత సాయం చేస్తున్నా, చమురు అమ్మకాలతో ఆర్థికంగా బలంగా ఉన్న రష్యా(Russian )ను నియంత్రించలేమనే అంచనాకు వచ్చేసిన అమెరికా (US), పాశ్చాత్య దేశాల కూటమి, ఇప్పుడు ఆంక్షల కొరడా ఝళిపిస్తున్నాయి. ఒకవైపు సుంకాలు, మరోవైపు ఆంక్షలతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన డొనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు అదనపు జరిమానా కూడా విధించారు. దీంతో భారత్ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రష్యా చమురును భారత్ కొనుగోలు చేస్తుండటం, దానికి జాతీయ ప్రయోజనాల పేరు చెప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. పైకి రష్యాతో భారత్ ఏం చేసుకున్నా తనకు అవసరం లేదంటున్న ట్రంప్, లోలోపల మాత్రం ఈ విషయంలో రగిలిపోతున్నట్లు మార్కో రూబియో మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొంటున్న భారతీయ రిఫైనరీలపై ఆంక్షలు మొదలయ్యాయి. భారత్ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా నుండి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది, ఇది మొత్తం దిగుమతుల్లో 35-40% వరకు చేరింది.
August 1st : ఈ నెలలో మారిన రూల్స్..కొత్త వచ్చిన వచ్చిన రూల్స్ ఇవే ..!!!
దీంతో “ఎందుకొచ్చిన తంటా” అనుకుందో ఏమో భారతీయ చమురు కంపెనీలు వెనక్కి తగ్గాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఆయా కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎంఆర్‌పీఎల్ వంటి ప్రముఖ చమురు సంస్థలు రష్యా ఆయిల్‌కు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని తెలుస్తోంది. కొంతకాలంగా నిరంతరాయంగా రష్యా చమురు కొనుగోలు చేస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు ట్రంప్ దెబ్బకు అబుదాబీకి చెందిన ముర్బన్ క్రూడ్, వెస్ట్ ఆఫ్రికన్ ఆయిల్ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం.
ఉక్రెయిన్‌తో రష్యా శాంతి ఒప్పందం చేసుకోకపోతే, ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ గత వారం హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, రష్యా చమురు సంస్థలపై పాశ్చాత్య దేశాల ఆంక్షల కొరడాతో ఆయా సంస్థలు కూడా 2022 తర్వాత ఎన్నడూ లేనంతగా రాయితీలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. అటు యూరోపియన్ యూనియన్ (EU) కూడా ఆంక్షలు విధిస్తుండటంతో రష్యా చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిణామాలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, మరియు భారత్ ఇంధన భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.