Denmark: డెన్మార్క్‌లో డ్రోన్ల కలకలం – విమానాశ్రయాల వద్ద అలర్ట్
డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రోయిల్స్ లుండ్ పోల్సెన్ స్పందిస్తూ, ఇది తలపెట్టిన చర్యగా అనిపిస్తోందన్నారు.
- By Dinesh Akula Published Date - 03:47 PM, Thu - 25 September 25

కోపెన్‌హెగన్, డెన్మార్క్: (Denmark) – డెన్మార్క్ దేశవ్యాప్తంగా డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత వారం రోజులుగా విమానాశ్రయాల వద్ద అనుమానాస్పదంగా డ్రోన్లు కనిపిస్తుండటంతో భద్రతా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. సోమవారం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్ట్ వద్ద మూడుచోట్ల భారీ డ్రోన్లు కనిపించాయి.
ఈ డ్రోన్ల కారణంగా అక్కడ విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిలిచిపోయాయి. పలు విమానాలు ఆలస్యం అయ్యాయి. గంటల తరబడి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే తరహాలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్‌పోర్టుల వద్ద కూడా డ్రోన్ల స్పాటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా అల్బోర్గ్ విమానాశ్రయాన్ని పాక్షికంగా మూసివేశారు.
డ్రోన్ల కదలికలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రోయిల్స్ లుండ్ పోల్సెన్ స్పందిస్తూ, ఇది తలపెట్టిన చర్యగా అనిపిస్తోందన్నారు. ఒక ప్రొఫెషనల్ హ్యాండ్ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తెలిపారు. ఇది ఒక హైబ్రిడ్ యుద్ధక్రమంలో భాగంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే మిలిటరీకి నేరుగా ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ఇప్పటికైతే డ్రోన్లను కూల్చకుండా, పౌరుల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చామని డెన్మార్క్ డిఫెన్స్ చీఫ్ మైఖేల్ హైడ్‌గార్డ్ స్పష్టంచేశారు.
ఈ డ్రోన్ల కలకలంలో రష్యా ప్రమేయం ఉండొచ్చని డెన్మార్క్ ప్రధాని మిట్టె ఫ్రెడరిక్‌సన్ అభిప్రాయపడగా, అదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా మద్దతు పలికారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని రక్షణ మంత్రి ట్రోయిల్స్ తెలిపారు.
ఈ పరిస్థితులు కొనసాగుతున్న వేళ యూరోపియన్ యూనియన్ దేశాలు డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు కలసికట్టుగా చర్యలు తీసుకోవాలని డెన్మార్క్ మంత్రులు పిలుపునిచ్చారు.