Monkeys Into Space:అంతరిక్షంలోకి కోతులను పంపనున్న చైనా
అంతరిక్ష కేంద్రంలో జీవశాస్త్ర ప్రయోగాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
- By Hashtag U Published Date - 12:02 PM, Mon - 7 November 22

అంతరిక్ష కేంద్రంలో జీవశాస్త్ర ప్రయోగాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారరహిత స్థితిలో పునరుత్పాదకత ఎంతవరకు సాధ్యమనే ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం త్వరలో అంతరిక్షంలోకి కోతులను పంపించనున్నట్లు తెలిపారు. అక్కడ వాటి పెరుగుదల, పిల్లలను కనే అవకాశం ఎంతవరకు ఉందనేది పరీక్షించనున్నట్లు వివరించారు. సొంతంగా తలపెట్టిన అంతరిక్ష కేంద్రం ‘తియాంగాంగ్ స్పేస్ స్టేషన్’ కూడా దాదాపుగా పూర్తికావొచ్చినట్లు చైనా పేర్కొంది. దీనికి సంబంధించి ఇటీవలే చివరి మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపిన విషయాన్ని గుర్తుచేసింది.
తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ లో కొంత భాగాన్ని జీవశాస్త్ర ప్రయోగాల కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. ఇందులో జీవ పరిణామంపై ప్రయోగాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కోతులను అంతరిక్షంలోకి పంపించి, అక్కడ వాటి లైంగిక జీవనం, పునరుత్పాదకత శక్తిని పరీక్షించనున్నట్లు వివరించారు. అంతరిక్ష ప్రయోగాలకు నేతృత్వం వహించే చైనా శాస్త్రవేత్త జాంగ్ లూ ఈ వివరాలను వెల్లడించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది.