Shubhanshu Shukla : కాసేపట్లో భూమిపైకి శుభాంశు శుక్లా
Shubhanshu Shukla : ఆయన జూన్ 25న అంతరిక్షానికి వెళ్లి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నారు.
- By Sudheer Published Date - 06:27 AM, Mon - 14 July 25

భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్షంలో తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి, కాసేపట్లో భూమిపైకి చేరుకోనున్నారు. యాక్సియం-4 మిషన్(Axiom-4 mission)లో భాగంగా, ఆయన జూన్ 25న అంతరిక్షానికి వెళ్లి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఈ మిషన్‌లో శుభాంశుతోపాటు మరో ముగ్గురు అంతరిక్ష యాత్రికులు కూడా ఉన్నారు. వీరంతా ఇప్పుడు కాలిఫోర్నియా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో దిగే అవకాశం ఉంది.
ఈ 18 రోజుల వ్యోమ ప్రయాణంలో శుభాంశు శుక్లా వివిధ భౌతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్షంలో మానవ శరీరంపై గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో ఎలాంటి ప్రభావాలు పడతాయో తెలుసుకునే లక్ష్యంతో కొన్ని పరిశీలనలు చేశారు. అంతేకాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలు మరింత సులభంగా, సురక్షితంగా చేయాలనే ఉద్దేశంతో నిర్వహించే టెక్నాలజీ టెస్టుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.
శుభాంశు శుక్లా విజయవంతమైన అంతరిక్ష యాత్ర భారత అంతరిక్ష పరిశోధన రంగానికి గర్వకారణంగా మారింది. ఇస్రోతో పాటు ప్రైవేట్ భాగస్వాముల ద్వారా భారత్ అంతరిక్ష రంగంలో తన పరిజ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా చూపిస్తోంది. శుభాంశు మళ్లీ భూమిపైకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా, ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత వ్యోమగాముల తరం ముందుకు సాగేందుకు ఈ మిషన్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.