Imran Khan : ఇమ్రాన్ ఖాన్ లక్ష్యంగా జైలుపై ఉగ్రదాడి.. ఏమైందంటే ?
- Author : Pasha
Date : 08-03-2024 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
Imran Khan : మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న అడియాలా సెంట్రల్ జైలుపై ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు దాడి చేశారు. గురువారం రాత్రి ముగ్గురు ఆప్ఘన్ ఉగ్రవాదులు జైలుపై అకస్మాత్తుగా తుపాకులు, ఐఈడీలు, గ్రనేడ్‌లు, మందుగుండు సామగ్రితో విరుచుకుపడ్డారు. అయితే వెంటనే అప్రమత్తమైన పాక్ భద్రతా బలగాలు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆయుధాలను, జైలుకు సంబంధించిన మ్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను విచారణ కోసం రహస్య ప్రదేశానికి తరలించారు.
We’re now on WhatsApp. Click to Join
పోలీసులు, ఇతర నిఘా విభాగాల సిబ్బంది కలిసి అడియాలా సెంట్రల్ జైలు చుట్టూ పహారాను పెంచారు. పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ జైలులో ఖైదీలు ఉండాల్సిన సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. ఇదే ఖైదీల గుంపు నడుమ ప్రత్యేక సెల్స్‌లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో(Imran Khan) పాటు మాజీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్ సన్నిహితుడు షా మహమూద్ ఖురేషీ ఉన్నారు.
Also Read : Ramagundam Fertilizers : లక్షన్నర దాకా శాలరీ.. రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 27 జాబ్స్
ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలుపై దాడి వెనుక ‘తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్’ (టీటీపీ) ఉగ్ర సంస్థ హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. టీటీపీకి పాకిస్తాన్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో సురక్షిత స్థావరాలు ఉన్నాయని పాక్ ఆర్మీ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో టీటీపీ రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందని అంటోంది. 2022 సంవత్సరం చివర్లో పాకిస్తాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినప్పటి నుంచి టీటీపీ ఉగ్రదాడులను వేగవంతం చేసింది. ఈనేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లోని ఆప్ఘన్ శరణార్ధులను వెనక్కి పంపించే కార్యక్రమాన్ని పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. గత సంవత్సరం చివర్లో సరైన ధ్రువపత్రాలు లేని దాదాపు 10వేల మంది ఆఫ్ఘన్ పౌరులను తమ భూభాగం నుంచి పాకిస్తాన్ వెనక్కి పంపించేసింది.