భార్యతో గొడవ.. ఒక్క డాలర్ కోసం జైలుపాలు!
ఒక్కోసారి భార్య మాటలు విని భర్తలు ఇబ్బందుల పాలవుతుంటారు.
- By Anshu Published Date - 09:41 PM, Wed - 21 December 22

ఒక్కోసారి భార్య మాటలు విని భర్తలు ఇబ్బందుల పాలవుతుంటారు. అయితే అలాంటివి ఎక్కువగా కనిపించవు అనుకోండి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. భార్య మాటలు విన్న భర్త చెరసాల పాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో స్టార్ బక్స్ అనే కాఫీ షాపు ఉంది. ఆ షాపుకు చాలా మంది వస్తుంటారు. అక్కడ కాఫీ, టీలు చాలా మందికి ఇష్టం.
రిచర్ట్ ఎంగెలే అనే 61 వ్యక్తి తన భార్యను తీసుకుని ఆ కాఫీ షాపుకు వెళ్లి కాఫీ తాగాడు. స్టార్ బక్స్ కాఫీ స్టోర్ లో ఆ దంపతులిద్దరూ కాఫీ తాగారు. ఆ తర్వాత ఇంటికి వెల్లిపోయారు. ఆ మరుసటి రోజు భార్య తనకు రావాల్సిన రీఫండ్ డబ్బుల కోసం కాఫీ షాపు వద్దకు వెళ్లింది. అక్కడున్న సిబ్బందిని తనకు రావాల్సిన అమౌంట్ అడిగింది. నిన్న కాఫీ తాగామని తమకు 1.23 డాలర్లు రావాల్సి ఉందని ఆమె తెలిపింది. అయితే అక్కడున్న క్యాషియర్ తగిన రిసిప్ట్ ఉంటేనే డబ్బులు రీఫండ్ ఇస్తామని తెలిపాడు.
రిసిప్ట్ లేకుండా తాను వెళ్లడమే కాకుండా ఆ క్యాషియర్ తో గొడవకు దిగింది. అక్కడ నానా హంగామా చేసింది. ఆమె ఎంత చేసినా స్టార్ బక్స్ కాఫీ షాపు సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆమె ఇంటికొచ్చి తన భర్తను తీసుకెళ్లింది. తన భర్త అయిన రిచర్ట్ ఎంగెలే అక్కడున్న క్యాషియర్ తో గొడవకు దిగాడు. ఆ సమయంలో క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి క్యాష్ డబ్బాలను తీసుకుని పరుగులు తీశాడు. కాఫీ షాపు సిబ్బంది ఆ వ్యక్తి కారు నంబర్ నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అమెరికా పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంతకీ అతను ఎంత కొట్టేశాడంటే 1.32 డాలర్లు. ఇంత తక్కువ డబ్బులు దొంగిలించి ఆయన అరెస్ట్ అయ్యాడు. భార్య మాట విని బురదలో పడ్డావని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.