Gaza School : గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి.. 100 మంది మృతి
పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి.
- By Pasha Published Date - 11:09 AM, Sat - 10 August 24

Gaza School : పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున గాజా నగరంలోని అల్ సహాబా ఏరియాలో ఉన్న అల్ తబాయీన్ పాఠశాలపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 100 మంది చనిపోయారు. అయితే అది స్కూల్ కాదని.. స్కూల్ మాటున నడుస్తున్న హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఇజ్రాయెల్ ఆర్మీ(Gaza School) వెల్లడించింది. ఈవివరాలను హమాస్ కూడా ధ్రువీకరించింది. ఈ దాడిని భయంకరమైన ఊచకోతగా అభివర్ణించింది.
We’re now on WhatsApp. Click to Join
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. పలువురిని కిడ్నాప్ చేసి గాజా ప్రాంతంలోకి తీసుకెళ్లిపోయారు. ఇంకా 111 మంది ఇజ్రాయెలీ బందీలు హమాస్ మిలిటెంట్ల చెరలోనే ఉన్నారు. వారంతా గాజాలోని హమాస్ రహస్య స్థావరాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. 111 మంది ఇజ్రాయెలీ బందీల్లో 39 చనిపోయారని ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. గత 11 నెలల యుద్ధంలోనూ గాజాలోని రహస్య స్థావరాల మిస్టరీని ఇజ్రాయెల్ ఛేదించలేకపోయింది. గాజాలోనే ఉన్న హమాస్ అగ్రనేత యహ్యా సిన్వార్ ఆచూకీని కనుగొనలేకపోయింది. బందీల జాడ ఏ స్థావరంలో ఉందనే అంచనాను కూడా ఇజ్రాయెల్ వెలువరించలేకపోయింది.
Also Read :Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్
మొత్తం మీద గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 39,699 మంది సామాన్య పౌరులు మరణించారు. గాజా ప్రాంతంలోకి నీళ్లు, ఆహారం వెళ్లనివ్వకుండా నిరంకుశంగా యుద్ధం చేస్తున్నా ఇజ్రాయెల్ నేటికీ సానుకూల ఫలితాలను సాధించలేకపోయింది. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్ నిరంకుశ నిజ స్వరూపం యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ న్యాయస్థానం అంటే లెక్క లేకుండా ఇజ్రాయెల్ దూకుడుగా వ్యవహరిస్తూ అప్రతిష్టను మూటకట్టుకుంటోంది. తాజాగా స్కూలుపై దాడి చేసి 100 మందిని ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.