Manish Sisodia : ‘‘స్వాతంత్య్రం వచ్చాక తొలి టీ’’.. భార్యతో కలిసి సిసోడియా తొలి పోస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెలల పాటు తిహార్ జైలులో గడిపిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు శుక్రవారం విడుదలయ్యారు.
- By Pasha Published Date - 10:43 AM, Sat - 10 August 24

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 17 నెలల పాటు తిహార్ జైలులో గడిపిన ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు శుక్రవారం విడుదలయ్యారు. ఈనేపథ్యంలో ఆయన శనివారం ఉదయాన్నే ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన భార్యతో కలిసి టీ తాగుతున్న ఒక ఫొటోను ఆయన విడుదల చేశారు. ఈ ఫొటోకు ‘‘ 17 నెలల తర్వాత స్వాతంత్య్రం పొందిన తొలి ఉదయం వేళ నా మొదటి టీ’’ అని సిసోడియా(Manish Sisodia) క్యాప్షన్ పెట్టారు. ‘‘జీవించే హక్కును రాజ్యాంగం మనదేశ పౌరులందరికీ ఇచ్చింది. అందరితో పాటు అందరితో సమానంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే స్వాతంత్య్రాన్ని ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు’’ అని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
శుక్రవారం రోజు సిసోడియాకు బెయిల్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కేసులు విచారణలో ఉన్నాయని చెప్పి.. ఇష్టం వచ్చినన్ని రోజు నిందితులను ఎవరూ జైలులో ఉంచలేరు’’ అని బెంచ్ స్పష్టం చేసింది. ‘‘నిందితులను ఇష్టం వచ్చినన్ని రోజులు జైలులో ఉంచాలని భావించడం సరికాదు.. అలా చేస్తే సదరు వ్యక్తి హక్కులను హరించినట్లు అవుతుంది’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, కోర్టు నుంచి ఉపశమనం పొందడం అనేది నిందితుల హక్కు’’ అని తెలిపింది.
శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన వెంటనే ఆప్ శ్రేణులను ఉద్దేశించి మనీశ్ సిసోడియా ఎమోషనల్‌గా ప్రసంగించారు. ‘‘జైలులో నేను ఒంటరిగా లేను. ఢిల్లీ ప్రజలు, చిన్నారులంతా మానసికంగా నాతోనే ఉన్నారు’’ అని ఆయన తెలిపారు. ప్రజల ప్రేమ, భగవంతుడి ఆశీస్సులు, సత్యానికి ఉన్న బలం తన వెంట నిలిచాయన్నారు. దేశ రాజ్యాంగానికి ఉన్న శక్తి వల్లే తాను జైలు నుంచి బయటికొచ్చానని సిసోడియా చెప్పారు. ఇదే రాజ్యాంగ శక్తి ప్రభావంతో అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు నుంచి విడుదలవుతారని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వికి సిసోడియా ధన్యవాదాలు చెప్పారు.